విశాఖపట్నం, జూన్ 29 (way2newstv.com)
2019 సంవత్సరంలో సరికొత్త రాజకీయ వ్యవస్థ రాబోతుందని, ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా రెపరెపలాడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి జీవం జనసైనికులే అని స్పష్టం చేశారు. నాయకులు ఉండొచ్చు, వెళ్లిపోవచ్చు కానీ, జనసైనికులు ఎప్పుడు నాతోనే ఉంటారన్నారు. టీడీపీ, వైసీపీలకు డబ్బులిస్తే జనం వస్తారు.. జనసేనకు మాత్రం స్వచ్ఛందంగా, ప్రేమతో వస్తారని, వారు డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులు కాదని అన్నారు. జనసేన పార్టీలో చేరిన నాయకులు జనసైనికుల్ని గౌరవించాలని, వారిని గౌరవిస్తే..నన్ను గౌరవించినట్లేనని అన్నారు. ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రేమను ఇచ్చిన మీకు .. నా తుది శ్వాస వరకు వెన్నంటే ఉంటానని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. బుధవారం ఉదయం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వివిధ పార్టీల నాయకులూ, పలువురు ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. భారీ సంఖ్యలో వారి అనుచరులు జనసేనలో చేరారు. బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోన తాతారావు, అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కొణతాల సీతారాం, ప్రముఖ క్రికెటర్ వేణుగోపాలరావు, విశాఖ నగరానికి చెందిన బాలాజీ స్కూల్స్ అధినేత మండవ రవి కుమార్, పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన రామచంద్ర రావు తమ అనుచరులతో పార్టీలో చేరారు. వీరికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "తుది శ్వాస వరకూ ప్రజా జీవితంలోనే ఉంటూ వారికి అండగా ఉంటాను. నటన ఉత్తరాంధ్ర నుంచి ఎలాగైతే ప్రారంభించానో.. రాజకీయ ప్రయాణం కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించానని అన్నారు.
2019లో జనసేన జెండా ఎగరడం ఖాయం ఉత్తరాంధ్రలో స్థానిక నాయకులకే పెద్దపీట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
ఇది వెనకబడిన ప్రాంతం కాదు వెనక్కి నెట్టేసిన ప్రాంతం. ఉత్తరాంధ్ర యాస, భాష, కళలతో పాటు ఆత్మను అర్ధం చేసుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే. ఈ ప్రాంత స్వరూపాన్ని, స్వభావాన్ని అర్ధం చేసుకున్న స్థానిక నాయకులకే జనసేన పెద్దపీట వేస్తుంది. ఇవాళ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. 2003లో రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకున్నా. 2009లో కూడా పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం సమస్యలను అర్ధం చేసుకోవడం కోసమే. 2014లో సుస్థిరత కోసం టీడీపీ, బీజేపీ పార్టీలకుమద్దతు ఇచ్చాను. రాజకీయాల్లో లబ్ధి పొందాలనుకుంటే ఆనాడు బీజేపీని కేంద్రమంత్రి పదవి, టీడీపీ మద్దతు ఇచ్చినందుకు బేరసారాలు ఆడేవాడిని. కానీ దేశ రాజకీయాల్లో విలువలు బతికే ఉన్నాయని చెప్పాడానికి అవేవి ఆశించకుండా మద్దతు పలికాను. జనసైనికుల కోసం జులై2 నుంచి జనసేన శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయి. ప్రతి జిల్లా నుంచి 3 వేల మందిని ఇందుకోసం ఎంపిక చేశాం. ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే పదవిని కోరుకుంటున్నారు.. నేను మాత్రం సమస్యల పరిష్కారం వెతకడం కోసం వచ్చాను. సమస్యకు పరిష్కారం వెతకడం ఉద్దానం నుంచే మొదలుపెట్టాను. త్రికరణ శుద్ధితో చాలా సహనంతో రాజకీయాల్లో ఉంటున్నా. నాకు చాలా ఓపిక ఎక్కువ. ఎంత ఓపిక అంటే ఒక సినిమా హిట్ కోసం 12 ఏళ్లు ఎదురుచూశా. రేపు ఎన్నికలకు వెళ్ళేదీ ఒక తరాన్ని రెండు తరాలను మేల్కొల్పడానికే. 2019లోజనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది. అందులో భాగంగానే మన నాయకులందరూ మనస్పూర్తిగా జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. మేధావుల సలహాల, సంప్రదింపులతోనే జనసేన మ్యానిఫెస్టో రూపుదిద్దుకుంటుందని అన్నారు.