అమరావతి జూన్ 26 (way2newstv.com)
తమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తామని శాసన మండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ ధీమాగా చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కడప ఉక్కు ఫ్యాక్టరీని ఎలా సాధించాలో చంద్రబాబు నాయుడుకు తెలుసన్నారు. 5 కోట్ల ఆంధ్రుల హక్కు కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసన మండలి సభ్యుడు బీటెక్ రవి ఇద్దరూ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వారికి మద్దతు తెలుపకుండా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తాం: మండలి విప్ డొక్కా
వారికి ఉక్కు ఫ్యాక్టరీ కావాలని లేదన్నారు. తనకు అనుమతిస్తే రెండేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తానని గాలి జనార్ధన రెడ్డి చెబుతున్నారన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపిందని చెప్పారు. ఇదంతా బీజేపీ, వైసీపీ, గాలి జనార్ధన రెడ్డి ఆడుతున్న నాటకం అన్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోతే బీజేపీ ఎండగడతామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని వైసీపీ నేత జగన్మోహన రెడ్డి గానీ, జనసేన నేత పవన్ కల్యాణ్ గానీ కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేయరని ఆయన ప్రశ్నించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేది చంద్రబాబు నాయుడేనని, ప్రధానిని నిర్ణయించేది తెలుగు ప్రజలనేని డొక్కా అన్నారు.