టైట్ షెడ్యూల్ తో పార్లమెంట్ సమావేశాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టైట్ షెడ్యూల్ తో పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ, జూన్ 26(way2newstv.com) 
వర్షాకాల సమావేశాలకు షెడ్యూలొచ్చింది. జులై 18 నుంచి ఆగష్టు 10 వరకు ఈ సెషన్లు కొనసాగుతాయి. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంట్ కేబినెట్ వ్యవహారాల ఉపసంఘం ఈ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మొత్తం 18 రోజుల పాటూ కొనసాగనున్న సమావేశాల్లో ఓబీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ట్రిపుల్ తలాక్ సహా పలు కీలక బిల్లుల్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది.
 
 
 
టైట్ షెడ్యూల్ తో పార్లమెంట్ సమావేశాలు
 
 అలాగే ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధమన్నారు అనంత్‌కుమార్. గత బడ్జెట్ సెషన్‌ మొత్తం వాయిదాల పర్వంతోనే కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో పాటూ కావేరి వ్యవహారం ఉభయ సభల్ని కుదిపేసింది. పట్టుమని పది నిమిషాలు కూడా పార్లమెంట్ కొనసాగని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ సమావేశాలు ప్రారంభకానుండటంతో.. అందరి దృష్టి హోదావైపు మళ్లింది. ఏపీకి సంబంధించి వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో.. ఇక మిగిలింది టీడీపీ, బీజేపీ ఎంపీలు మాత్రమే. అయితే ఈ సమావేశాల్లో కూడా టీడీపీ ఎంపీలు హోదా, విభజన హామీలపై తమ వాదనను బలంగా వినిపించి.. పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారట. అలాగే అవిశ్వాస తీర్మానం కూడా మళ్లీ తెరపైకి వచ్చే అవకాశమూ లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది.  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ అధ్యక్షతన పార్లమెంట్ కేబినెట్ వ్యవహారాల ఉపసంఘం ఇవాళ సమావేశమైంది.. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనంత్ కుమార్ స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం వచ్చినా దానిపై కూడా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.