తూర్పు గోదావరిలో యనమల లొల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తూర్పు గోదావరిలో యనమల లొల్లి

కాకినాడ జూలై 18 (way2newstv.com)
ఏపీ టీడీపీలో అగ్ర‌నేత వ్య‌వ‌హార శైలి పార్టీకి ఇబ్బంది క‌రంగా మారింద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు త‌ర్వాత అటు పార్టీలోనూ, ఇటు ప్ర‌భుత్వంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తూర్పుగోదావ‌రికి చెందిన సీనియ‌ర్ నేత, ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రో ప‌ది మాసాలు లేదా అంత‌క‌న్నా ముందుగానే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని భావిస్తున్న నేప‌థ్యంలో టీడీపీలో టికెట్ల వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. టికెట్ల గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఈ విష‌యంలో మొన్న రెండు రోజుల కింద‌ట చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్‌.. క‌ర్నూలులో చేసిన ప్ర‌క‌ట‌న తీవ్ర దుమారం రేపింది. ఇక్క‌డ ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌కు ఆయ‌న‌కు క్లీన్ చిట్ ఇవ్వ‌డం ముఖ్యంగా వివాదంగా మారిన ఎస్వీ మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వానికి లోకేష్ మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం నేత‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. లోకేష్ క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు ఎంపీగా బుట్టా రేణుక‌ను, ఎమ్మెల్యేగా ఎస్వీ.మోహ‌న్‌రెడ్డిని గెలిపించుకోవాల‌ని అక్క‌డ బహిరంగంగానే చెప్పారు. 
 
 
 
 తూర్పు గోదావరిలో యనమల లొల్లి
 
ఈ వ్యాఖ్య‌ల‌పై రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ.వెంక‌టేష్ తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ర్నూలు అసెంబ్లీ సీటును ఆయ‌న త‌న‌యుడు టీజీ.భ‌ర‌త్ ఆశిస్తున్నారు. ఎవ్వ‌రూ టికెట్ల విష‌యంలోనూ అభ్యర్థుల విష‌యంలోనూ మాట్లాడ కూడ‌దంటూ హుకుం జారీ చేశారు. ఈ హుకుం అంద‌రికీ ఒక్క‌టేన‌ని కూడా బాబు వెల్ల‌డించారు. అయితే, మంత్రి య‌న‌మ‌ల మాత్రం.. ఈ ల‌క్ష‌ణ రేఖ‌ను దాటేశారు. చంద్ర‌బాబు మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా మ‌రోసారి ఆయ‌న టికెట్లు, అభ్య‌ర్థుల విష‌యంలో ప్ర‌క‌ట‌న‌లు చేసి ఇప్ప‌డు మ‌రో చిచ్చుకు కార‌ణ‌మ‌య్యారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ… రాజానగరం ఎమ్మెల్యేగా పెందుర్తి వెంకటేష్ ను తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉన్నదంటూ జనానికి సందేశం ఇచ్చేశారు.రాజాన‌గ‌రంలో పెందుర్తి రెండుసార్లు గెలిచారు…ఆయ‌న్ను గెలిపించ‌మ‌ని చెప్ప‌డంతో ఆగ‌ని య‌న‌మ‌ల తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ సీట్లు దాదాపు ఖరారే అంటూ హామీలిచ్చారు. ఈ ప‌రిణామం స్థానిక నేత‌ల్లోముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఆశిస్తున్న‌వారికి మండించేలా చేసింది. నామినేషన్లు వేసే చివరి నిమిషం దాకా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను తేల్చకుండా.. మంచిచెడులు బేరీజు వేస్తూ కూర్చునే చంద్రబాబు నాయుడు నిర్ణయంతో నిమిత్తం లేకుండా.. ఇటీవ‌ల లోకేష్‌.. ఇప్పుడు య‌న‌మ‌ల ఇలా టికెట్లు ప్ర‌క‌టించ‌డంపై అంద‌రూ విస్మ‌యానికి గుర‌వుతున్నారు. సిటింగులందరికీ ఖరారే అని మంత్రి చెప్పేయడంతో కొన్ని నియోజకవర్గాలపై ఆశలు పెంచుకుంటున్నవారు ఖంగు తింటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే టికెట్ల ఎంపిక నిర్ణయాలను ప్రకటించే తెలుగుదేశం పార్టీలో.. య‌న‌మ‌ల అత్యుత్సాహం ఏంట‌నేది అంద‌రూ అడుగుతున్న ప్ర‌శ్న‌. గ‌త ఏడాది జ‌రిగిన ఓ సంఘ‌ట‌న చెప్పుకోవాలి. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మేయ‌ర్ విష‌యంలో య‌న‌మ‌ల ఇలానే అగ్గి రాజేశారు. త‌న గ్రూపున‌కు చెందిన ఓ మ‌హిళ‌కు ఆయ‌న తెర‌చాటుగా హామీ ఇచ్చేశారు. అయితే, చివ‌రి నిముషంలో స్థానిక ఎమ్మెల్యే త‌న గ్రూపున‌కు చెందిన మ‌హిళ‌కే కేటాయించాలంటూ.. తెర‌మీద పెద్ద వివాదాన్ని రాజేశారు. ఈ ప‌రిణామం నుంచి తేరుకునేందుకు చంద్ర‌బాబు రంగ ప్ర‌వేశం చేసినా.. చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఇప్పుడు కూడా య‌న‌మ‌ల ఇదే ధోర‌ణి ప్ర‌ద‌ర్శించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. త‌న‌కు అనుకూలంగా ఉన్న వ్య‌క్తులు ఉన్న‌ప్ప‌టికీ.. విష‌యాన్ని చంద్ర‌బాబుకు చేర‌వేసి.. ఆయ‌న ద్వారా ప్ర‌క‌ట‌న చేయించి ఉంటే బాగుండేద‌ని.. ఇలా చేయ‌డం వల్ల పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ అనే మాట‌కు కూడా విలువ లేకుండా పోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు య‌న‌మ‌ల‌కు ఎలా క్లాసిస్తారో చూడాలి.