ఏపీలో ఎటూ తేలని పంచాయితీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో ఎటూ తేలని పంచాయితీ

విజయవాడ, జూలై 27, (way2newstv.com)
మరో మూడు రోజుల్లో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత గ్రామ పాలన ఏ విధంగా ఉండబోతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు పంచాయతీల పాలనపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేదు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీలకు 2013 జూలై నెలలో విడతల వారీగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికైన పాలకవర్గాలు ఆగస్టు 2వతేదీన ప్రమాణ స్వీకారం చేశారు. రానున్న ఆగస్టు 2వతేదీతో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తిగా ముగియనుంది. ఈ లోపే ఎన్నికలకు వెళ్లాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవటంతో ప్రత్యేక అధికారుల పాలన విధించే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. 
 
 
 
ఏపీలో ఎటూ తేలని పంచాయితీ
 
కానీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది ముఖ్య నేతలు ప్రస్తుతం ఉన్న సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెస్తున్నారు. అయితే పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల పట్ల ముఖ్యమంత్రి అంత సానుకూలంగా లేనట్టు బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుస్తోంది. వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రామాల్లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలపై పురోగతి కనిపించకపోవటంతో ఇందుకు కారణాలు ఏమిటని అధికారులను సీఎం ప్రశ్నించారు. ఓ రాష్ట్ర స్థాయి అధికారి సర్పంచ్‌లు అయిష్టత చూపుతున్నారని తెలియచేయగా పాలకవర్గాల గడువు సమయం ఎంత ఉందని సీఎం ఆ అధికారిని అడిగారు. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుందని సదరు అధికారి చెప్పటంతో ఒకే ప్లాన్ చేద్దామని చెప్పారు. దీని బట్టి సీఎం చంద్రబాబు పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకం కంటే ప్రత్యేక అధికారుల పాలనపై మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పర్సన్ ఇన్‌ఛార్జ్‌ల నియమించాలనే ఆలోచన ఉంటే అక్కడిక్కడే చెప్పే వారని, ఒకే ప్లాన్ చేద్దాం అంటే ప్రత్యేక అధికారుల పాలనకే ఆయన మొగ్గు చూపుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయంలో జరుగుతున్న జాప్యం కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కూడా కుంటుపడుతోంది. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా పాలకవర్గాల నుండి సరైన సహకారం లభించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో నిర్వహించే చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలను సాధారణంగా గ్రామ సర్పంచ్‌లే నామినేషన్ వర్క్స్‌గా చేస్తారు. అయితే గత మూడు నెలలుగా గ్రామంలో ఏ రోడ్డు నిర్మించాలన్నా తర్వాత సదరు పనికి డబ్బులు వస్తాయో లేదో తెలియక ముందుకు రావడం లేదు.