తెలంగాణ కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలంగాణ కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి

హైద్రాబాద్, జూలై 18 (way2newstv.com) 
ఆలులేదు చూలు లేదు కొడుకు పేరు అజారుద్దీన్ అన్నట్లు టి కాంగ్రెస్ లో వివాదం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగుతానంటూ భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో కాక పుట్టించాయి. ఈ స్థానం నుంచే బరిలోకి దిగే అంజన్ కుమార్ యాదవ్ కి కడుపుమంట రేకెత్తించాయి. ఇక ఆయన అనుచరుల ఆగ్రహానికి అంతేలేకుండా చేసేశాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా బలమైన కేసీఆర్ అండ్ టీం పై పోరాటానికి నడుం కడుతున్న కాంగ్రస్ లో కల్లోలం ఏర్పడింది. దీన్ని చల్లార్చడానికి మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి వంటివారికి తలప్రాణం తోకకు వచ్చేసింది.కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ ఎక్కడ టికెట్ అన్నది ప్రకటించుకునే సంప్రదాయం ఇప్పటివరకు లేకుండా నడుస్తూ వచ్చింది. తాజాగా ఆ పార్టీలో ట్రెండ్ మారింది. ఎవరికీ నచ్చిన స్థానాన్ని వారు ఎంపిక చేసుకుని వచ్చే ఎన్నికల్లో తాము ఇక్కడినుంచే ఎంపి ఎమ్యెల్యేలమంటూ అభ్యర్థిత్వాలు ప్రకటించుకోవడం టి కాంగ్రెస్ లో అగ్గి రాజేస్తోంది. ఈ పరిస్థితి ఎక్కడివరకు దారితీస్తుందో తెలియడం లేదని కాంగ్రస్ క్యాడర్ తెగ మధన పడిపోతుంది. తాజాగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానం లొల్లి అలాంటిదే. ఒకసారి యుపి లోని ముజఫరాబాద్ నుంచి పార్లమెంట్ స్థానానికి గెలిచిన అజారుద్దీన్ ఆ తరువాత రాజస్థాన్ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు. అధిష్టానం ఆయన్ను వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేయాలో ఇంకా ప్రకటించకపోయినా అజార్ సికింద్రాబాద్ ఎంపి సీటుపై కన్నేయడమే తాజా వివాదానికి కారణమైంది. ఇటీవల టి కాంగ్రెస్ లో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. ఎవరికీ వారే తమకు అధిష్టానం టికెట్ ఇచ్చేసినట్లు చేసే ప్రకటనలు కాంగ్రెస్ లో లేనిపోని వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితి నుంచి టి కాంగ్రెస్ గట్టేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

తెలంగాణ కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి