మంత్రి వర్గ విస్తరణపై గిరిజనుల కొండంత ఆశలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మంత్రి వర్గ విస్తరణపై గిరిజనుల కొండంత ఆశలు

విజయనగరం, జూలై 27, (way2newstv.com)
రాష్ట్ర జనాభాలో దాదాపు 25 లక్షల మందిపైగా విస్తరించి ఉన్న గిరిజనులకు గత నాలుగున్నర సంవత్సరాలుగా మంత్రివర్గంలో కనీస ప్రాతినిధ్యం లేకపోవటం పై ఆ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో గిరిజనుల్లో అత్యధిక మంది వైకాపాను ఆదరించడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన రెడ్యా నాయక్, ఉత్తరాంధ్రకు చెందిన బాలరాజు మంత్రివర్గంలో కొనసాగారు. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజనులకు ఒక్క మంత్రివర్గంలోనే కాదు నామిటేడెడ్ పదవుల్లోనూ న్యాయం జరగటం లేదు. గత నాలుగున్నర సంవత్సరాలుగా గిరిజన శాఖకు ఎస్సీలే ప్రాతినిధ్యం వహిస్తుంటే ఎస్టీ, ఎస్టీ కమిషన్‌కు సైతం ప్రస్తుతం ఎస్సీ వర్గానికి చెందిన కారం శివాజీ కొనసాగుతున్నారు. 
 
 
 
మంత్రి వర్గ విస్తరణపై గిరిజనుల కొండంత ఆశలు
 
ఇక కార్పొరేషన్‌లు విడిపోయినప్పటికీ ఎస్టీ కార్పొరేషన్‌కు నేటి వరకు పాలకవర్గమే లేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు వైకాపా నుంచి వలస వచ్చిన జూపూడి ప్రభాకర్ చైర్మన్‌గా అదీ రెండోసారి కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన కోఆపరేషన్, కార్పొరేషన్ ఉంటే దానికి కూడా పాలకవర్గం లేదు. ప్రస్తుత ప్రభుత్వ కాల పరిమితి మరో ఏడాదిలో ముగుస్తున్నందున ఈ చివరి రోజుల్లోనైనా గిరిజనులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. మొత్తం 175 శాసన స్థానాల్లో గిరిజనులకు ఆరు స్థానాలు రిజర్వ్ కాగా ఐదు స్థానాల్లో వైకాపా గెలుపొందింది.అరకు లోక్‌సభ స్థానంలో కూడా ఆ పార్టీకి చెందిన కొత్తపల్లి గీత ఎన్నికైనప్పటికీ ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క పోలవరం నుంచే టీడీపీ తరఫున మిడియం శ్రీనివాస్ గెలుపొందినప్పటికీ ఆ తర్వాత కాలంలో వైకాపా తరపున గెలుపొందిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి తెలుగుదేశంలోకి వలస వెళ్లారు. వైకాపా నుంచి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లగా వారిలో అగ్ర వర్గానికి చెందిన నల్గురుకి మంత్రి పదవులు ఇవ్వగా గిరిజనులకు స్థానం కల్పిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ముస్లింలు కూడా మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఒక్క ముస్లిం కూడా గెలువలేదు. వైకాపా తరపున గెలుపొందిన వారిలో జలీల్‌ఖాన్ టీడీపీలోకి వాలస వెళ్లి వక్ఫ్‌బోర్డు చైర్మన్ కాగా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే శాసన మండలిలో ఉన్న టీడీపీ సీనియర్లలో ఫరూక్ శాసనమండలి చైర్మన్‌గా వ్యవహరిస్తుంటే ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్ మంత్రి పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు.