హైదరాబాద్ ఆగష్టు 7 (way2newstv.com)
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జయశంకర్ సార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ జ్ఞాపకాలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వ్యాప్తి చేయడంలో కఠోర శ్రమ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ పేరు చరిత్రపుటలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు సీఎం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో వచ్చిన మార్పు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జయశంకర్ సార్ ఆత్మకు కచ్చితంగా శాంతిని చేకూర్చుతాయని సీఎం పేర్కొన్నారు.
ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్: కేసీఆర్
జయశంకర్ ఆశయాలకు అనుగుణంగానే సమర్ధ పాలన:కడియం
తెలంగాణా ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన స్ఫూర్తి:కేటిఅర్
న్యూడిల్లీ: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీఆర్‌ఎస్ ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి టీఆర్‌ఎస్ ఎంపీలు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఎంపీ కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్: ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా.. ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ యాదిలో ఆయన ఆశయాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. ఆంధ్రను, తెలంగాణను కలుపొద్దు అని ఎస్ఆర్సీ, ఫజల్ అలీ కమిషన్ ముందు మొదట వ్యతిరేకించిన వ్యక్తి జయశంకర్ సార్. విశాలాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా గళమెత్తింది ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ మలి ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. దురదృష్టవశాత్తు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన మన మధ్య లేకుండా పోయారు. తెలంగాణ వచ్చాక ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని జయశంకర్ సార్ ఆశించారో నేడు సీఎం కేసీఆర్ సమర్ధ నాయకత్వంలో అవే పథకాలు అమలు అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కరెంట్ కోసం మనం చాలా గోస పడ్డాము. రైతులు ఆందోళన చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ తెలంగాణ వచ్చాక మొదటి సంవత్సరంలోనే కోతలు లేని కరెంట్ ఇచ్చాము. ఆ తరవాత ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున ఏటా 8 వేల రూపాయలను, మొత్తంగా 12 వేల కోట్ల రూపాయలను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే.
కోట్ల మొక్కలను హరితహారంలో భాగంగా నాటి హరిత తెలంగాణ సృష్టించే లక్ష్యం తో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికున్నపుడు ఏమైతే చేయాలని అనుకున్నారో నేడు సీఎం కేసీఆర్ అవన్నీ అమలు చేస్తున్నారు. జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేటలో 2 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని మిగిలిన అన్ని అభివృద్ధి పనులు కూడా చేస్తాం.. అని మంత్రి కడియం అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి జోగు రామన్న నివాళులర్పించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. నాలుగు కోట్ల ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్‌కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.