డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవం

చెన్నైఆగష్టు 28 (way2newstv.com)
డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ ప్రకటించారు. పార్టీకోశాధికారిగా దురై మురుగన్‌ ఎన్నికయ్యారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకేలో 50 ఏళ్ల తర్వాత అధ్యక్షుడి మార్పు జరిగింది. 0ఈరోజు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలోఈ నిర్ణయం తీసుకున్నారు. స్టాలిన్‌ ఎన్నికతో డీఎంకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి నినాదాలు చేస్తున్నారు.యాభై ఏళ్లపాటు డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన కరుణానిధి కన్నుమూసిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్టాలిన్‌ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కరుణానిధి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో అన్ని పనులు చూసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీలో బలమైన నేతగా, తండ్రి రాజకీయ వారసుడిగా శ్రేణులకు గట్టి నమ్మకాన్ని కల్పించారు. పార్టీలోని సీనియర్‌ నేతల నుంచి కుటుంబంలోని ఎక్కువ మంది సభ్యుల వరకు మద్దతును కూడా ఆయన కూడగట్టారు.అయితే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన స్టాలిన్‌ అన్న అళగిరి మాత్రం కాస్త కలకలం రేపారు. 
 
 
 
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవం
 
తన తండ్రి మద్దతుదారులు తనవైపే ఉన్నారని, అవసరమైనప్పుడు సత్తా చాటుతానన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పినట్లుగానే వచ్చే నెల 5న చెన్నైలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. అవసరమైతే సొంత పార్టీ పెట్టడమా? భాజపా, రజనీకాంత్‌ పార్టీతో కలిసి నడవడమా? అనేది కూడా ఆయన ర్యాలీ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. అళగిరి ఎంత హెచ్చరికలు చేసినప్పటికీ స్టాలిన్‌లో మాత్రం ఏమాత్రం ఆందోళన కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తన తండ్రి కరుణానిధి మరణంతో పార్టీ బాధ్యత తీసుకున్నానని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తానని ప్రకటించారు. అళగిరి చేపట్టనున్న ర్యాలీని తేలిగ్గా తీసుకుని తాను అనుకున్నట్లుగానే పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్‌ ప్రక్రియలో అధ్యక్ష పదవికి మరెవరూ ముందుకు రాకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది.కరుణానిధికి స్టాలిన్‌ మూడో కుమారుడు. 1953 మార్చి 1న మద్రాసులో జన్మించారు. ఈయన పుట్టిన నాలుగు రోజుల తర్వాతే రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌ మరణించారు. వామపక్ష భావాలపై ఉన్న మమకారంతో కరుణానిధి తన తనయుడికి స్టాలిన్‌ అని పేరు పెట్టారు. స్టాలిన్‌ చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 14ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1967 ఎన్నికల్లో తండ్రి తరఫున ప్రచారం చేశారు. 1973లో డీఎంకే జనరల్‌ కమిటీకి స్టాలిన్‌ ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన జైలుకెళ్లడంతో స్టాలిన్‌ పేరు వార్తల్లో నిలిచింది. తమిళనాడు అసెంబ్లీని స్టాలిన్ నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.కరుణానిధి తర్వాత పార్టీ బాధ్యతలు ఎవరు చేపడుతారా అన్న సందిగ్ధత డీఎంకే శ్రేణుల్లో చాలా కాలం పాటు ఉంది. అయితే ఈ సందిగ్ధతను తొలగిస్తూ స్టాలినే తన రాజకీయ వారసుడంటూ 2013 జనవరిలో కరుణానిధి ప్రకటించారు. ఆ తర్వాత 2017లో స్టాలిన్‌ డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.అన్నాదురై, కరుణానిధి తర్వాత డీఎంకే పగ్గాలు చేపట్టిన మూడో వ్యక్తిగా స్టాలిన్‌ నిలిచారు. 1944లో పెరియార్‌ ఈ. వి రామస్వామి ద్రవిడార్‌ కజగం పార్టీని స్థాపించారు. ఇదే పార్టీలో సీఎన్‌ అన్నాదురై కూడా ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత పెరియార్‌, ఆయన అనుచరులకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో 1949లో అన్నాదురై పార్టీ నుంచి విడిపోయి ద్రవిడ మున్నేట్ర కజగం అనే పేరుతో సొంతంగా పార్టీ ప్రారంభించారు.1969లో అన్నాదురై మరణించారు. దీంతో మళ్లీ పార్టీ వారసుడిపై విబేధాలు తలెత్తాయి. సీనియర్‌ నేతలైన కరుణానిధి, వీఆర్‌ నెదున్‌చెజియాన్‌ మధ్య పోటీ నెలకొనగా.. కరుణానిధివైపే పార్టీ నేతలు మొగ్గుచూపారు. దీంతో కరుణానిధి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఐదు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కరుణానిధి అధ్యక్ష బాధ్యతలు కొనసాగించారు. తాజాగా కరుణ మరణంతో స్టాలిన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు.