22 తర్వాత 110 మంది అభ్యర్ధుల జాబితా.. ? - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

22 తర్వాత 110 మంది అభ్యర్ధుల జాబితా.. ?

విజయవాడ, ఫిబ్రవరి 18, (way2newstv.com)
ఎపుడు ఎన్నికల ముందు వరకు అభ్యర్ధులను ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు వంద రోజుల ముందే అభ్యర్ధులని ప్రకటించి షాక్ ఇవ్వనున్నారా ? అవును అనే అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. రానున్న లోక్‌సభ, శాసనసభ స్థానాలకు జరుగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈనెల 22, 23 తేదీల నాటికి వంద నుంచి 110 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేయించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.


22 తర్వాత 110 మంది అభ్యర్ధుల జాబితా.. ?

 ఇందులో అత్యధికంగా ఎలాంటి వివాదం లేని స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఉంటారని ఆయన అన్నారు. సుమారు 20 లోక్‌సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.మొదటి జాబితాలో దాదాపు అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరు, విశాఖపట్టణం వంటి జిల్లాల్లో అత్యధిక స్థానాలు ఉంటాయని అనుకుంటున్నారు. తొలి జాబితా ప్రకటించిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఇటీవలి కాలంలో వలసలు పెరగడానికి కారణం అభ్యర్థుల జాబితా సిద్దం కావడమేనన్న చర్చ జరుగుతోంది. పార్టీలో పోటీచేసే అవకాశం లేదని నిర్థారణకు వచ్చిన వారు క్రమేణా, మరో పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 30 నుంచి 35 మందికి తొలి జాబితాలోనే స్థానం దక్కవచ్చని భావిస్తున్నారు. అలాగే వైసీపీ నుండి వచ్చిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలలో దాదాపు 15 మంది మరోమారు టీడీపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. వివాదాలు, అభ్యర్థులు ఎక్కువగా ఆశిస్తున్న స్థానాలకు సంబంధించి 60-70 స్థానాలు ఉంటాయని, వాటికి సంబంధించి ఆయా స్థానాల నేతలు జిల్లా స్థాయి నేతలు, పొలిట్‌బ్యూరోలు ఒకటికి రెండుసార్లు చర్చించిన మీదటే అభ్యర్థులను ఖరారు చేయాలని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే మరోవారం రోజుల్లో టీడీపీ తొలి జాబితా విడుదల ఖాయమని భావిస్తున్నారు.