కోటి మంది రైతులకు 2 వేల కోట్ల జమా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోటి మంది రైతులకు 2 వేల కోట్ల జమా

హైద్రాబాద్, ఫిబ్రవరి 25  (way2newstv.com
రైతులకు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఫిబ్రవరి 24 న ప్రారంభించారు. తొలి రోజు కోటి మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల కోట్లు జమచేశారు. ఇక, పీఎం కిసాన్‌ పథకం కింద ఆదివారం తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.100 కోట్లను కేంద్రం జమ చేసింది. దాదాపు 5 లక్షల మంది రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ పథకాన్ని ప్రధాని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించిన తరవాత ఆయా రాష్ట్రాల్లోని జిల్లా వ్యవసాయాధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా ఈ పథకం ప్రారంభ కార్యక్రమాలను లాంఛనంగా నిర్వహించారు. 


 కోటి మంది రైతులకు 2 వేల కోట్ల జమా

తెలంగాణలో ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి కలిగిన 27 లక్షల మంది రైతుల్లో అర్హులైన 17.90 లక్షల మంది వివరాలను పీఎం-కిసాన్‌ పోర్టల్‌లో రాష్ట్ర వ్యవసాయ అధికారులు నమోదు చేశారు. పథకం ప్రారంభించిన తొలి రోజు వీరిలో 5 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున కేంద్రం జమ చేసింది. ఒకేసారి అందరికీ నగదు జమచేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో సోమవారం నుంచి ప్రతీరోజు కొద్ది మంది రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తామని కేంద్రం తెలిపింది. వారం రోజుల్లోగా తెలంగాణలోని అర్హులైన రైతులకు నగదు జమ అవుతుంది. రైతు ఖాతాలో రూ.2 వేలు జమ కాగానే అతని మొబైల్‌కు కేంద్ర వ్యవసాయశాఖ నుంచి మెసేజ్ వస్తోంది. ‘పీఎం-కిసాన్‌ యోజన కింద 2000 రూపాయల మొదటి వాయిదా మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అయింది. ప్రతి నాలుగు నెలలకూ లభించే ఈ మొత్తంతో మీ వ్యవసాయ అవసరాలకు మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను. - శుభాకాంక్షలతో నరేంద్ర మోదీ’ అని అందులో ఉంది. ఈ మెసేజ్ వచ్చినా ఖాతాకు నగదు బదిలీ కాకపోతే వెంటనే సంబంధిత అధికారికి సమాచారం అందజేయాలని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.