దోమల దండయాత్ర(నెల్లూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దోమల దండయాత్ర(నెల్లూరు)

నాయుడుపేట, ఫిబ్రవరి 12 (way2newstv.com): 
పట్టణంలో దోమల బెడద తీవ్రమైంది. లక్షలు పెట్టి కాలువల్లో పూడికలు తీసినా మురుగుతో ప్రధాన డ్రైనేజీలు నిండిపోతున్నాయి. పూడిక తీసిన కొన్ని నెలలకే మళ్లీ పూడిక భారీగా చేరుతోంది. చెత్తచెదారం, వ్యర్థాలు పేరుకుపోతోంది. రోడ్లు, ఖాళీ స్థలాల్లో అక్కడక్కడా మురుగు నీరు నిలిచి కంపుకొడుతోంది. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌, పిచ్చిరెడ్డితోపు, బాలాజీగార్డెన్‌, బీడీకాలనీ , మూకాంబిగుడి వీధి, తుమ్మూరులలో ఇళ్ల పక్కన మురుగునీటి గుంతలు ఉన్నాయి. ఈ గుంతల్లో దోమల వృద్ధి జరుగుతోంది. వీటిల్లో ఆయిల్‌ బాల్స్‌ వదలడంలేదు. వదిలితే నామమాత్రంగా వదిలి నిమ్మకుండి పోతున్నారు. కాలువల్లో దోమల మందు పిచికారీ చేసి ఎన్ని నెలలు అవుతోందో. ఫాగింగు మాట మరిచిపోయారు. 


దోమల దండయాత్ర(నెల్లూరు)

ఈ ఏడాది జనవరి 31న జరిగిన అత్యవసర సమావేశంలో బ్లీచింగు, ఫినాయిలు కొనుగోలుకు రూ.లక్ష చొప్పున కేటాయింపులకు తీర్మానం చేశారు. సున్నం కొనుగోలుకు రూ.లక్ష, దంతెలు, బుట్టలు, వస్తుసామగ్రి కొనుగోలుకు రూ.2లక్షలు, చీపుర్లు, గడ్డపారలు, పారలు, కత్తులకు రూ.2లక్షలు చొప్పున అత్యవసరంగా వాడేందుకు సభ్యుల అనుమతి పొందారు. ఇన్ని లక్షల్లో ప్రతేడాది వీటికి ఖర్చు చేస్తూనేఉన్నారు. అందుకు తగ్గట్లుగా పారిశుద్ధ్యం మెరుగుపడటంలేదు. మరోవైపు కాల్వల్లో పూడిక తీసేందుకు ప్రతేడాది రూ.5లక్షలు నుంచి రూ.20లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. అయినా శుభ్రత లేదు. పాలక సభ్యులు సమావేశాల్లో దోమల గురించి ప్రశ్నించినా అధికారులు స్పందించి చేయడంలేదు.
పట్టణం మొత్తం విస్తరించి ఉండే విన్నమాల మురుగు కాల్వ దోమల పెరుగుదలకు ప్రధాన కారణం. అయితే ఈ కాల్వ పూడిక తీసేందుకు ఇరిగేషన్‌ శాఖ అధికారులు రూ.20లక్షలకు పైగా నిధులు ఖర్చు చేసి పని పూర్తి చేయలేదు. నామమాత్రంగా పనిచేసి వదిలేశారు. దీంతో ఈ మురుగునీటిలో దోమలు ప్రబలి ప్రజల రక్తం పీల్చేసి రోగాలు తెస్తున్నాయి. పట్టణంలోని గాంధీమందిరం నుంచి ఆర్టీసీ బస్సుస్టాండు వరకూ ప్రధాన డ్రైనేజీ కాల్వలోకి ఇళ్లలోని మరరుగుదొడ్ల పైపులను కలిపేశారు. వ్యర్థాలతో కాల్వలు రెండు మూడు నెలలకు నిండిపోయి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోంది. విన్నమాల కాల్వలోను ఇదే పరిస్థితి. ఈ పైపులు తొలగించాలని ఇటీవల ఛైర్‌పర్సన్‌ మైలారి శోభారాణి ఆదేశించినా అమలు కాలేదు.
  తుమ్మూరు ఎస్సీ కాలనీ, చంద్రబాబునగర్‌, బీడీకాలనీ, శ్రీరామ్‌నగర్‌, సప్తకగిరి కట్ట, ఆర్ముగంనగర్‌, విన్నమాలకాల్వ గట్టు, విన్నమాలరోడ్డు, ఎన్‌ఎస్‌ఆర్‌ కాలనీ అవతలికాలనీ, జైహింద్‌కాలనీ, మునిరత్నంనగర్‌, పిచ్చిరెడ్డితోపు కొంతభాగం. మూకాంబికగుడివీధి ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉంది.