కాంగ్రెస్ సీనియర్లలో నిరాసక్తత

హైద్రాబాద్, ఫిబ్రవరి 28, (way2newstv.com)
కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో మాత్రం నాకొద్దీ సీటు  అనే రాగాలు వినిపిస్తున్నాయి. ముందే చేతులెత్తోస్తోంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేయాలని ఆశపడుతున్నవారి సంఖ్య దాదాపు 350 ఉన్నప్పటికీ వాటిని వడపోత పోసి ఒక స్పష్టతకు రావడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముప్పుతిప్పలు పడుతోంది. జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఏఐసిసికి ఒక్కో స్థానానికి ముగ్గురి చొప్పున పేర్లను ఖరారు చేయడానికి పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైనా కొలిక్కి రావడానికి మాత్రం పార్టీ నేతల్లోనే అనేక రకాలుగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని ఎంపిక చేయడం రాష్ట్ర కమిటీకి కత్తిమీద సాములా మారింది. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి జానారెడ్డి కుమారుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు వరుసలో ఉండడంతో నిర్ణయం తీసుకోవడం, ఏఐసిసికి ప్రతిపాదించడం తలనొప్పిగా మారింది. ఇక ఒకే జిల్లాకు చెందిన పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం కూడా ఇదే తరహా తలనొప్పిగా మారింది.




కాంగ్రెస్ సీనియర్లలో నిరాసక్తత


గద్వాల అసెంబ్లీ నుంచి ఓటమిపాలైన డి.కె. అరుణను రాన్నున పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంటాయి ప్రతిపాదిస్తే ‘ఈ సీటు నాకొద్దు’ అంటూ ఆమె నిరాసక్తత వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడిగా ఉన్న జైపాల్‌రెడ్డి ఉండగా తాను పోటీ చేయడం భావ్యం కాదని సున్నితంగా తిరస్కరించారు. అయితే ఈసారి జైపాల్‌రెడ్డి పోటీ చేయడానికి ఇష్టపడడంలేదు అంటూ ఆయన తరఫున పిసిసి చీఫ్ వివరణ ఇవ్వగా ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీకి వెనక్కి తగ్గితే ఎలా’ అని ఆమె ఎదురు ప్రశ్నించారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుచరులకు జైపాల్‌రెడ్డి ఎందుకు టికెట్లు ఇప్పించుకున్నారని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. పలు నియోజకవర్గాలపై గాంధీభవన్‌లో  జరిగిన రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, భువనగిరి, నిజామాబాద్, నల్లగొండ తదితర స్థానాలపై వాడివేడి చర్చ జరిగింది.నాగర్‌కర్నూల్ నుంచి సిట్టింగ్ ఎంపిగా ఉన్న నంది ఎల్లయ్య ఈసారి కూడా పోటీ చేయడానికి సుముఖంగానే ఉన్నారు. అయితే రేవంత్‌రెడ్డి మాత్రం సతీష్ మాదిగ పేరును ప్రతిపాదించారు. డీకే అరుణ కూడా ఆ ప్రతిపాదనను సమర్ధించారు. కానీ ఆలంపూర్ మాజీ ఎంఎల్‌ఏ సంపత్‌కుమార్ మాత్రం అర్హత ఉన్నవారి పేర్లను మాత్రమే జాబితాలో పెట్టాలని సూచిస్తూ రేవంత్‌రెడ్డి ప్రతిపాదనకు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారిని కాదని, కొత్తగా చేరినవారికి అవకాశం ఇవ్వడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. డికె అరుణ జోక్యం చేసుకుని శాసనసభ్యుడి స్థాయి కలిగినవారికి సైతం ఏఐసిసిలో అవకాశాలు లభిస్తున్నాయని, పరోక్షంగా సంపత్‌కుమార్‌ను ప్రస్తావించారు. సంపత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆమె వ్యతిరేకించారు. డి.కె. అరుణ వాదనతో కుంటియా కూడా ఏకీభవించడంతో వాదన అర్ధాంతరంగా ముగిసిపోయింది.భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మధుయాష్కీ పేరును జాబితాలో చేర్చడంపై ఎల్‌బి నగర్ శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో ఈసారి భువనగిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అయితే నిర్దిష్టంగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఖరారు కాకపోవడంతో నిజామాబాద్ పోటీ చేస్తారో లేక భువనగిరి నుంచి చేస్తారో మధుయాష్కీయే తేల్చుకోవాలని మాజీ ఎంఎల్‌సి షబ్బీర్ అలీ సూచించారు. దీంతో మిగిలిన నేతలు కూడా ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారో తేల్చుకోవాలని మధుయాష్కీకి సూచించారు.కరీంనగర్ పట్టభద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అధికారికంగా బుధవారం ప్రకటిస్తామన్నారు. ఎంఎల్‌ఏ కోటాలో కాంగ్రెస్ ఎంఎల్‌సి అభ్యర్థి ఎవరనేది వీలైనంత తొందరలో తేలుస్తామన్నారు. పార్టీ తరఫున ఉపాధ్యాయుల ఎంఎల్‌సి కోటాలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను మాజీమంత్రి సునీత లక్ష్మారెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. పార్లమెంట్ అభ్యర్థులపై రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తయిందని, జిల్లా కమిటీలుపంపిన జాబితాపై చర్చించి షార్ట్ లిస్ట్ చేశామని, ఎన్నికల కమిటీ ఎంపిక చేసిన జాబితాను ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీకి పంపుతామని వివరించారు. ఢిల్లీలో బుధవారం జరగనున్న స్క్రీనింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు
Previous Post Next Post