మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్
300 మంది ఉగ్రవాదుల హతం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (way2newstv.com)
పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలను భారత్ ఆరంభించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. నియంత్రణ రేఖ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారి 3.45 గంటలు, పీఓకేలోని ముజఫర్‌బాద్‌లోని శిబిరంపై 3.48, చికోటీలో 3.58 గంటలకు మిరాజ్ 2000 రకానికి చెందిన 12 యుద్ధ విమానాలతో దాడిచేసినట్టు ఇండియన్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.పుల్వామా ఆత్మాహుతి దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ గగనతలంలోకి దూసుకెళ్లి దట్టమైన అటవీ ప్రదేశంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడులు చేసింది. ఏం జరుగుతుందో పాక్ తెలుసుకునేసరికే మిరాజ్ యుద్ధ విమానాలు తమ పనిని పూర్తిచేసి వెనుదిరిగాయి. వీటిని కూల్చడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది.
భారత్ ప్రతీకార చర్యలు...
బాలాకోట్‌లోని లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్, జైష్మే మహ్మద్ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిక్షణా శిబిరంపై తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో 12 యుద్ధ విమానాలు దాడి చేశాయి. బాలాకోట్, ముజఫరాబాద్, చికోటి స్థావరాలపై 1000 కిలోల బాంబులను జారవిడిచి పూర్తిగా ధ్వంసం చేశాయి. మూడు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు టార్గెట్... ఎక్కడ బాంబు దాడులు చేయాలో ముందుగానే నిర్ణయించుకున్నారు. ఆపై శ్రీనగర్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి మిరేజ్ యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యాయి. బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై తెల్లవారుజామున 3.45 గంటల నుంచి 3.53 గంటల మధ్య తొలి దాడి జరిగింది.
తెల్లవారుజామున 3.45కు తొలి దాడి
బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారి 3.45 గంటలు
పీఓకేలోని 3.48 గంటలకుముజఫర్‌బాద్‌లోని శిబిరంపై దాడి
చకోటీ ప్రాంతంలో 3.48 గంటలకు బాంబుల వర్షం
4.15 గంటలకల్లా వెనక్కు వచ్చేసిన ఫైటర్ జెట్లు
భారత వాయుసేన విమానాలు బాలాకోట్ ను చేరిన మూడు నిమిషాల వ్యవధిలో మరో నాలుగు విమానాలు ముజఫరాబాద్ కు వెళ్లాయి. అక్కడి ఉగ్రవాద శిబిరంపై 3.48 గంటల నుంచి 3.58 గంటల మధ్య దాడులు జరిగాయి. అటాక్ 3లో భాగంగా చకోటీ ప్రాంతానికి వెళ్లిన ఫైటర్ జెట్స్ 3.58 నుంచి 4.04 గంటల మధ్య బాంబుల వర్షం కురిపించాయి. ఆపై 4.12 నుంచి 4.15 గంటల కెల్లా అన్ని విమానాలూ ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. తాము దాడి చేయాలనుకున్న ప్రాంతాలను యుద్ధ విమానాలు ఆటోమేటిక్ గా గుర్తించాయని, సరిగ్గా ఆ ప్రాంతంలోనే బాంబులను వేసి వచ్చాయని సైన్యాధికారి ఒకరు ప్రకటించారు.ఎల్ఓసీ వద్ద ఉన్న శిబిరాల నుంచి ఉగ్రవాదులను పాక్ తరలింపు చేపట్టింది. కానీ, భారత సైన్యం అనూహ్యంగా పాక్ భూభాగంలోకి 49 ఏళ్ల తర్వాత తొలిసారిగా చొచ్చుకెళ్లింది. 1971 పాక్ యుద్ధం తర్వాత భారత వాయుసేనకు చెందిన విమానం నియంత్రణ రేఖను దాటి ఆ దేశ గగనతలంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. కార్గిల్ యుద్ధ సమయలోనూ ఐఏఎఫ్ విమానాలు ఎల్ఓసీని దాటివెళ్లలేదు. మన భూభాగం నుంచే ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇంతకు ముందు జరిగిన సర్జికల్ దాడులు, గతంలోనూ ఉగ్రవాదులపై జరిపిన దాడుల సమయంలోనూ నియంత్రణ రేఖను అధిగమించలేదు. వైమానిక దాడులతో అమాయక ప్రజల ప్రాణాలు కూడా పోతాయని భావించి వెనకడుగు వేశారు. కానీ, ప్రస్తుతం జరిగిన వైమానిక దాడిలో సాధారణ పౌరులకు ఎటువంటి హాని జరగకుండా, పాక్ సైన్యం కళ్లుగప్పి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా సమన్వయంతో దాడి చేసింది. ఐఏఎఫ్‌కి చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. తాజా సర్జికల్ దాడిలో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. భారత్ ఇప్పటికే పాక్ సరిహద్దుల్లోని వైమానిక స్థావరాలైన జామ్‌నగర్; మాల్యా, అహ్మదాబాద్, వడోదరలో అప్రమత్తమైంది. జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీ ఉగ్రవాద సంస్థల సంయుక్త శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ముజఫరాబాద్ సెక్టార్‌లో ఎల్‌ఓసీని అతిక్రమించి భారత వైమానిక దళ విమానం తమ భూభాగంలోకి ప్రవేశించాయి. పుల్వామా ఉగ్రదాడితో భారత్ మరోసారి సర్జికల్ దాడులు చేస్తుందని పాక్ ఊహించింది. గతంలో ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత 2016 సెప్టెంబరు 29న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఎల్ఓసీ వెంబడి ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులకు పాల్పడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంది.ప్రాథమిక సమాచారం ప్రకారం.. సర్జికల్ దాడుల్లో 300 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖను దాటి పాక్ భూభాగంలో భారత యుద్ధ విమానాలు చొచ్చుకుపోయి సర్జికల్ దాడులకు నిర్వహించినట్టు పలు ఆధారాలు ధ్రువీకరిస్తున్నాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వ్యవస్థలో ఇది స్పష్టంగా వెల్లడయినట్టు ఓ మీడియా వెల్లడించింది. దాడులు జరిగిన సమయంలో ఐఏఎఫ్‌కి చెందిన ముందస్తు హెచ్చరికల విమానం ఈఎంబీ 145 సరిహద్దుల్లో మంగళవారం ఉదయం చక్కర్లు కొట్టినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌లో గుర్తించారు. ఆ ప్రాంతంలో సంచరించినట్లు ఈ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. గగనతల పరిస్థితులను అంచనా వేసి ఈ విమానాలకు సమాచారం అందజేయడానికి ఈఎంబీ 145, ఐఎల్-78 కూడా వెళ్లినట్లు భావిస్తున్నారు. యుద్ధ విమానాల ద్వారా 1000 కిలోల బాంబులను జారవిడిచినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో 300 మంది వరకూ ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. సర్జికల్ దాడులపై భారత వైమానిక దళం అధికారిక ప్రకటించింది. కానీ, పాక్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందించారు. భారత వాయుసేన విమానాలు నియంత్రణ రేఖను దాటి తమ భూభాగంలోకి వచ్చాయని, కానీ పాక్ విమానాలు మిరాజ్ విమానాలను వెంటాడటంతో అవి తిరిగి వారి భూభాగంలోకి వెళ్లాయని తెలిపారు. ఈ క్రమంలో భారత విమానాలు కొన్ని బాంబులను బాల్కోట్ వద్ద జారవిడిచినట్లు చెబుతూ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోల్లో ఆ ప్రదేశం మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. అంతేకాదు, ప్రత్యర్థులపై తప్పుడు ప్రచారాలను సైతం నిర్వహిస్తుంది. ప్రస్తుతం కశ్మీర్‌లో అల్లర్లను ఎగదోయడంలో దీని పాత్ర తక్కువేమీ కాదు.
Tags:
all india news