మంత్రి వర్గ విస్తరణపై సీఎంవో నుంచి ఆదేశాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మంత్రి వర్గ విస్తరణపై సీఎంవో నుంచి ఆదేశాలు

ఏర్పాట్లలలో అధికారులు
హైద్రాబాద్, ఫిబ్రవరి 11, (way2newstv.com)
రాష్ట్ర మంత్రివర్గ ఏర్పాటు ప్రహసనం రోజుకో మలుపూ తిరుగుతున్నది. దీనిపై ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గానీ, అటు టీఆర్‌ఎస్‌ నుంచి గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు మాత్రం పత్రికలకు లీకుల మీద లీకులిస్తూ పోతున్నారు. డిసెంబరు, జనవరి ముగిసి.. చివరకు ఫిబ్రవరి రెండోవారం దాటినా క్యాబినెట్‌ ఏర్పాటు ఊసే లేకపోవటం గమనార్హం. ఇదే సమయంలో వచ్చే మంగళ లేదా బుధవారాల్లో ఏదో ఒకరోజు మంత్రివర్గ ఏర్పాటు ఉండొచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... మంత్రివర్గ ఏర్పాటుకు వీలుగా సర్వం సిద్ధం చేసి ఉంచాలంటూ ఉన్నతాధికారులకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి.


మంత్రి వర్గ విస్తరణపై సీఎంవో నుంచి ఆదేశాలు

 ఇదే సమాచారాన్ని అటు రాజ్‌భవన్‌కు కూడా చేరవేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళ లేదా బుధవారాల్లో ఏదో ఒకరోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారనే వార్తలకు మరింత బలం చేకూరుతున్నది. మరోవైపు సచివాలయంలోని డీ-బ్లాక్‌ మూడో అంతస్తులో మరమ్మతులు చేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ అంతస్తులో ఆర్థిక, ప్రణాళికాశాఖలున్నాయి. ఆ శాఖ మంత్రితోపాటు ముఖ్య కార్యదర్శి, మరో ఇద్దరు కార్యదర్శుల చాంబర్లతోపాటు విశాలమైన మీటింగ్‌ హాల్‌ కూడా ఉంది. అయితే ప్రస్తుతం వీటిలో కొన్నింటికి మరమత్తులు చేస్తున్నారు. నూతన హంగులను సృష్టిస్తున్నారు. పలుమార్లు తనిఖీలు చేసి, వివరాలు తెలుసుకున్న తర్వాతే మీడియా ప్రతినిధులను సైతం మూడో అంతస్తుకు అనుమతిస్తుండటం గమనార్హం. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పద్దుకు తుది మెరుగులు దిద్దే ప్రక్రియలో అధికారులందరూ తలమునకలై ఉన్నారు, అందువల్లే మూడో అంతస్తులోకి ఎవర్ని పడితే వారిని అనుమతించటం లేదంటూ అధికారులు చెబుతుండటం గమనార్హం. మరమ్మతుల విషయం మీడియా కంట పడకుండా ఉండేందుకే వారు ఇలాంటి వాదనలు ముందుకు తెస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఛాంబర్‌నే డీ-బ్లాక్‌లోకి తరలించే అవకాశాలున్నాయని పేరు చెప్పటానికి నిరాకరించిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. అందుకే హంగూ, ఆర్భాటం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఒకవేళ అలాగాకపోతే కేటీఆర్‌ ఛాంబర్‌ కోసమైనా మరమ్మతులు చేయిస్తూ ఉండొచ్చని మరో అధికారి చెప్పటం గమనార్హం