మొన్న సన్నాయి నొక్కులు... నిన్న కాళ్లబేరాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మొన్న సన్నాయి నొక్కులు... నిన్న కాళ్లబేరాలు

శ్రీనగర్, ఫిబ్రవరి 25 (way2newstv.com
పుల్వామా ఆత్మాహుతి దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతలోనే కాళ్లబేరానికి వచ్చారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురువుతోన్న ఒత్తిడో లేదా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని భయమో తెలియదు కానీ, పుల్వామా ఉగ్రదాడిలో పాక్‌ ప్రమేయంపై ఆధారాలుంటే ఇవ్వాలని, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఇరు దేశాల మధ్య శాంతి, సౌభ్రాతృత్వాల కోసం భారత ప్రధాని తనకు ఓ అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకుంది. ఉగ్రవాద దాడులను భరిస్తూ కూర్చునే ప్రభుత్వం తమది కాదని, ఇంతకి ఇంతా బదులు తీర్చుకుంటామని ప్రధాని హెచ్చరించారు. 


మొన్న సన్నాయి నొక్కులు... నిన్న కాళ్లబేరాలు

ప్రధాని ప్రకటనపై పాక్ కూడా తలబిరుసుగానే స్పందించింది. భారత్ దాడి చేస్తే తిప్పికొడతామని పాక్‌ బదులిచ్చింది. శనివారం రాజస్థాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మొత్తం ఏకమైంది.. ఉగ్రవాద నేరాలకు పాల్పడేవారికి తగిన గుణపాఠం చెబుతాం.. తమకు కలిగిన బాధను మరిచిపోం.. ప్రతీకారం తీర్చుకుని దానిని సరిచేస్తామని, తీవ్రవాదాన్ని ఎలా తరిమికొట్టాలో తమకు తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో జరిగిన ఫోన్ సంభాషణ గురించి మోదీ వెల్లడించారు. ‘పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేశాను. ఇన్నాళ్లు పోట్లాడుకున్నామని, ఇకపై పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలనకు ఐక్యంగా కృషి చేద్దామని కోరాను. ఇమ్రాన్‌ స్పందిస్తూ తాను పఠాన్‌ల కుమారుడినని, అబద్ధాలు చెప్పనని ఆ సందర్భంలో అన్నారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటారో? లేదో చూడాలి’ అని గుర్తు చేశారు. మోదీ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని కార్యాలయం స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. తాను ఇప్పటికీ అదేమాటకు కట్టుబడి ఉన్నానని, ఆధారాలు చూపాలని కోరింది. ఇరు దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వాల కోసం భారత ప్రధాని ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్‌ విజ్ఞప్తి చేశారు. కాగా, పుల్వామా ఉగ్రదాడికి తమ భూభాగం నుంచి వ్యూహరచన చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని ఫిబ్రవరి 19న ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఆధారాలు చూపమనడం ఓ కుంటిసాకుగా అభివర్ణించింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ, దాని అధినేత పాకిస్థాన్‌లోనే ఉన్నారనేది జగమెరిగిన సత్యమని, పుల్వామా దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోడానికి ఇంతకంటే ఆధారం కావాలా అని నిలదీసింది.