కూరలకు గాయాలే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కూరలకు గాయాలే

నల్లగొండ, ఫిబ్రవరి 16, (way2newstv.com)
వారం రోజులగా కూరగాయల ధరలు క్రమ క్రమంగా పెరుగుతుండటంతో వినియోగదారులు సతమతం అవుతున్నారు. దీనికి కారణం కొన్ని రోజులుగా నగర మార్కెట్‌కు  కూరగాయల దిగుమతి తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చౌకగా లభిస్తున్న కూరగాయల్లో టమాటా మాత్రమే ఉంది. ప్రస్తుతం టమాటా ధర కిలోకు 15 రూపాయలు పలుకుతోంది. కానీ మిగిలిన కూరగాయల ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. నగరానికి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చే కూరగాయలు సైతం బాగా తగ్గాయని అంటున్నారు. 


కూరలకు గాయాలే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, రాజస్థాన్ నుంచి టమాటా భారీగా దిగుమతి అవుతోంది.నగర మార్కెటుకు  రోజుకు  సుమారు 170  నుంచి 200 లారీల టమాటా దిగుమతి అవుతోంది. వంకాయలు, బెండకాయ, క్యాప్సికం, చిక్కుడు, బిన్నీసు వంటి వివిధ రకాల కూరగాయలు మార్కెట్కు తక్కువగా సరఫరా అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. వారం క్రితం వరకు  నగర మార్కెట్లో కిలో రూ.20 లోపే పలికిన వంకాయలు కిలో రూ.30 నుంచి రూ. 40 పలుకుతున్నాయి. పెద్ద వంకాయలైతే కిలో రూ. 40 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు. 
క్యాప్సికం దిగుమతి సైతం తగ్గినట్టు వ్యాపారులు తెలిపారు. క్యాస్పికం కిలో రూ.25 నుంచి రూ.30 పలుకగా ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.50కి చేరింది. బిన్నీసు ధర కూడా రూ.30 నుంచి ఏకంగా రూ.50 పలుకుతోంది. చిక్కుడు కాయ ధర కూడా అంతే.ప్రస్తుతం మార్కెట్లో కిలో చిక్కుడు రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20 పలికిన దొండకాయ ఇప్పుడు రూ.30 నుంచి రూ.40కి చేరింది. పచ్చిమిర్చి ధర కిలో రూ 20 నుంచి రూ.40కి చేరింది. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి.