రూ.10 కోట్లిస్తే చాలు (విజయనగరం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రూ.10 కోట్లిస్తే చాలు (విజయనగరం)

విజయనగరం, మార్చి 8 (way2newstv.com): 
పార్వతీపురం: జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా పూర్తి కాని సాగునీటి పథకం ఏదైనా ఉందా అంటే అది  జంఝావతి జలాశయమే. ప్రతి సంవత్సరం ఎంతో కొంత దీనిపై ఖర్చు చేస్తున్నారు. ఎంత చేసినా సరైన ప్రణాళిక లేకపోవడం, సాంకేతికంగా ఆలోచనలు చేయకపోవడం వంటి కారణాల వల్ల సాగునీరు అందించే ప్రయత్నానికి గండి పడుతోంది. సాగునీటి...మిగతా 15లో పథకాలకు ప్రాధాన్యమిచ్చిన తెదేపా ఈసారి జంఝావతి జలాశయానికి కోరినంత మొత్తాన్ని అందించింది. స్వయంగా జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జంఝావతిని సందర్శించి, రైతుల ఆకాంక్షను తీర్చేందుకు వీలుగా నిధులు కేటాయించారు. ఎంత చేసినా దీని కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించే స్థితి ఉందా? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. పూర్తి ఆయకట్టుకు నీరు కావాలంటే.. మరో రూ.పది కోట్లు  ఇస్తే.. సాధ్యపడుతుందని ఇంజినీరింగు అధికారులు చెబుతున్నారు.
రబ్బరు డ్యామ్‌ కింద 12 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. కానీ కాలువలు తవ్వి నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి. అందువల్ల వీటిని పూడికలు తీసి, మరమ్మతులు చేపట్టాలి. కానీ ఒడిశాతో ఉన్న వివాదం కారణంగా దీన్ని పూర్తయిన జలాశయపథకంగా గుర్తించకపోవడం వల్ల నిర్వహణ నిధులు రావడం లేదు. ఫలితంగా పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నారు. 


రూ.10 కోట్లిస్తే చాలు (విజయనగరం)

కాలువలను నచ్చిన దగ్గర తవ్వి, కఠినమైన పనులు విడిచిపెట్టేశారు. కాలువలు అనుసంధానించేందుకు 400 వరకు తూములు, తలుపులు అమర్చేందుకు నిర్మాణాలు చేపట్టాలి. ఇవి ఇంకా పూర్తి కాలేదు. ఈ పనులు నిర్వహించడానికి రూ.22 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఒన్‌ఆర్‌ డిస్ట్రిబ్యూటరీ కింద సాగునీరు ఇవ్వడానికి ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు తెల్ల ఏనుగులా మారింది. సాగునీరు ఇవ్వకపోగా, విద్యుత్తు బిల్లు ఘాతానికి జలవనరుల శాఖ గురవుతోంది. కాలువలు మెరుగుపరిచినా నీరు స్వేచ్ఛగా పారాలంటే.. కొమరాడ మండలం డంగభద్ర వద్ద కాలువలో ఉన్న రాతిని పేల్చాలి. కాలువలో  పడిపోతున్న మట్టికట్ట ఒడ్లును స్థిరపరచాలి. దీనికోసం అదనంగా రూ.2.9 కోట్లు కేటాయించారు. ఈపనులు  ప్రారంభించాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఇరవై నాలుగువేల ఎకరాలకు సాగునీరు అందివ్వగలరా? అంటే  ఆప్రశ్నకు సమాధానం పెదవివిరుపే వస్తోంది.
రబ్బరు డ్యాం కింద కేవలం 12 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఇంజినీర్లు జలాశయం నుంచి నీరు బయటకు విడిచిపెట్టే వ్యవస్థను రూపొందించారు. దీనికి అనుగుణంగా 225 క్యూసెక్కులు నీరు విడుదల చేసే తూములు ఏర్పాటు చేశారు. మరో పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైపులను కూడా ఈ కాలువలోనే పెట్టి పంపింగు చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే 12వేల ఎకరాలకు వదిలే నీటిని 24 వేల ఎకరాలకు అందించే సాహసం చేశారు. కానీ జలాలు పరుగు తీసే వీలు లేకుండా పోయింది.
జంఝావతి నుంచి పూర్తి సాగునీరు అందించేందుకు ఇంజినీరింగు అధికారులు కొత్త ప్రతిపాదనలు తెరమీదకు తీసుకువచ్చారు.  జలాశయంలో నీటి మట్టం పెంచి బయటకు నీరు విడిచిపెట్టి ఆనీటిని నిలిపేందుకు చెక్‌డాం నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ చెక్‌డాం గర్భంలో ఎత్తిపోతల పథకానికి సంబంధించి పంపింగు వ్యవస్థ పైపులను అమర్చాలని భావిస్తున్నారు. ఇది జరిగితే.. లోలెవెల్‌ కాలువ ద్వారా పన్నెండువేల ఎకరాలకు సాగునీరు అందించే వీలు కలుగుతుంది. అదే క్రమంలో ఎత్తిపోతల పథకం ద్వారా మిగిలిన విస్తీర్ణానికి సాగునీరు అందించేందుకు వీలుపడుతుంది. దీనికోసం రూ.పదికోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ నిధులు మంజూరైతే  ఒడిశాతో వివాదం మాట ఎలా ఉన్నా, పూర్తి  ఆయకట్టుకు సాగునీరు అందించే వీలుంటుంది.