తిరుమల, మార్చి 26, (way2newstv.com)
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా వసంతోత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. తిరుమలలో వసంతోత్సవాలు క్రీ.శ. 1360 నుంచి జరుగుతున్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి.ఈ ఉత్సవాలను చైత్ర శుద్ధ త్రయోదశి నుంచి పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఏప్రిల్ 17న చైత్రశుద్ధ త్రయోదశినాడు ఉదయం 7.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు.
ఏప్రిల్ 17 నుంచి సాలకట్ల వసంతోత్సవాలు
ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తియిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు శ్రీ భూ సమేత మలయప్పస్వామి ఉదయం 8.00 నుంచి 9.00 గంటల వరకు స్వర్ణ రథంపై తిరుమాడ వీధులలో విహరించనున్నారు. అనంతరం వసంత మండపంలో స్వామివారికి వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ మండపానికి ఊరేగింపుగా వెళ్లి వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంత్రం ఆలయాన్ని చేరుకుంటారు. ఉత్సవాల సందర్భంగా రోజు మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకిస్తారు. అలాగే రోజు సాయంత్రం ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామికి జరిగే ఉత్సవానికి వసంతోత్సవమని పేరు. సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించడం, వివిధ ఫలాలను తెచ్చి నివేదించడం ఈ క్రతువులో ప్రధాన ప్రక్రియ. మరోవైపు, వసంతోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 17 నుంచి 19 వరకు పలు రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.