సార్వత్రిక ఎన్నికలతో పాటు 8 రాష్ట్రాలకు ఎన్నికలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సార్వత్రిక ఎన్నికలతో పాటు 8 రాష్ట్రాలకు ఎన్నికలు

12వ తేదీన ఈసీ ప్రకటన..?
న్యూఢిల్లీ, మార్చి 9, (way2newstv.com)
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈనెల 12లోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఎప్పుడైనా ఉండే అవకాశాలున్నాయి. 7 లేదా 8 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ లో గడువు ముగుస్తుండటంతో సార్వత్రిక ఎన్నికలతో పాటే వీటి షెడ్యూల్ కూడా విడుదల కానుంది.ప్రస్తుతం జరుగుతున్న 16వ లోకసభ పదవీ కాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీతో ముగుస్తోంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జూన్ 18, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జూన్ 1, ఒరిస్సా అసెంబ్లీ పదవి కాలం జూన్ 11, సిక్కిం అసెంబ్లీ పదవీకాలం మే 27న ముగుస్తున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు నిర్వహించే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 8 రాష్ట్రాలకు ఎన్నికలు

అంతేగా ఈ ఏడాది చివర్లో ముగుస్తున్న మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాలు ముగుస్తుండడంతో ఆ మూడు రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అవుతాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది..సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ షెడ్యూల్ విడుదలపై ఆసక్తి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును పూర్తి చేసింది. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీలోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన బాధ్యులుగా ఉండే అధికారుల బదిలీలు పూర్తయ్యాయి. దీంతో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. మోడీ ప్రభుత్వానికి సంబంధించిన చివరి క్యాబినెట్ భేటీ సైతం పూర్తికావడంతో ఇప్పుడు అందరి దృష్టి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఉంది.2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు,17.3 లక్షల వి.వి పాట్ యంత్రాలు అవసరం అవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చింది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ మేరకు యంత్రాంగం సిద్ధంగా ఉందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటనలు పూర్తి చేశారు.మరోవైపు 2014లో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ ఏడో తేదీ నుంచి మే 12వ తేదీ వరకు 9 దశల్లో జరిగాయి. మే 16న దేశ వ్యాప్తంగా ఒకే సారి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి దశలో రెండు రాష్ట్రాల్లోని 6 నియోజకవర్గాలకు, రెండో దశలో ఐదు రాష్ట్రాల్లోని 7 నియోజకవర్గాలకు, మూడో దశలో పద్నాలుగు రాష్ట్రాల్లోని 92 నియోజకవర్గాలకు, నాలుగో దశలో మూడు రాష్ట్రాల్లోని 5 నియోజకవర్గాలకు, ఐదో దశలో 13 రాష్ట్రాల్లోని 122 నియోజకవర్గాలకు, 6 వ దశలో 12 రాష్ట్రాల్లోని 117నియోజకవర్గాలకు, ఏడవ దశలో తొమ్మిది రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలకు, ఎనిమిదవ దశలో 7 రాష్ట్రాల్లోని 64 నియోజకవర్గాలకు, తొమ్మిదవ దశలో మూడు రాష్ట్రాల్లోని 41నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 7 లేదా 8 దశల్లో నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ తయారు చేసిందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.