కర్నూలు, మార్చి 30 (way2newstv.com)
ఏపీ రాజకీయల్లో చిత్తూరు జిల్లాది చాలా కీలక పాత్ర. ఇద్దరు ముఖ్యమంత్రులను రాష్ట్రానికి అందించిన ఈ జిల్లా కీలక రాజకీయ సమరానికి వేదిక కాబోతుంది. జిల్లాపై 20 ఏళ్ళ క్రితం కోల్పోయిన ఆధిక్యాన్ని సాధించడానికి అధికార తెలుగుదేశం పార్టీ ఆరాటపడుతుండగా, కొనసాగుతున్న పట్టును నిలుపుకోవడానికి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్దమవుతోంది. అనూహ్యంగా చాపకింద నీరులా విస్తరిస్తున్న జనసేన పార్టీ కూడా తన పట్టు చూపించడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలో జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలలో ఈ మూడు పార్టీల నడుమ త్రిముఖ పోరు తప్పనిసరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల లాగే తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పేరొందిన చిత్తూరు జిల్లాను 80వ దశకం ఆరంభంలో పుట్టిన తెలుగుదేశం పార్టీ తన అధీనంలోకి తెచ్చుకోగలిగింది. 1983 ఎన్నికలలో జిల్లాలోని 14 స్థానాల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ...1985 ఎన్నికలలో పది స్థానాలకు తగ్గినా ఆధిక్యతను కొనసాగించింది. 1989 ఎన్నికలలో 10 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీని 1994వ ఎన్నికలలో ఒక స్థానానికి పరిమితం చేయగలిగింది. కానీ వరుసగా 1999, 2004, 2009 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధిగమించలేక పోయింది.
రాయలసీమలో ఎవరి ప్రభావం ఎంత
2014లో జరిగిన ఎన్నికలలో మొత్తం 14 స్థానాలలో 8 స్థానాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. ఒక విధంగా 1994 ఎన్నికల తర్వాత నుంచి జిల్లాలో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమవుతూ ఉంది. ఈ ఎన్నికలలో ఆధిక్యాన్ని సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో జిల్లాలోని 14 స్థానాలలో కనీసం 10 స్థానాలలో తీవ్రమైన ద్విముఖ పోటీ కనిపిస్తోంది. జిల్లాలో వైసీపీ పట్టు అదే విధంగా కనిపిస్తోంది. అయితే ఇది పొలింగ్ నాటికి ఎటువైపు తిరుగుతుందో చూడాలి. ఇక కడప జిల్లా పేరు చెబితే ముందుగా వైఎస్సార్ కుటుంబం గుర్తొస్తుంది. రాజారెడ్డి నుంచి రాజశేఖర్‌రెడ్డి...ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరకు తమ కుటుంబ పరంపరను అలానే కొనసాగిస్తూ వస్తున్నారు. వైఎస్ అంటే తమవాడే అనేంత బలమైన బావోద్వేగ బంధాన్ని ఏర్పరుచుకున్నారు జిల్లా వాసులు. ఇంతలా వైసీపీ పాతుకుపోయిన ప్రాంతంలో కూడా జిల్లాపై పట్టు సాధించేందుకు తెలుగుదేశం పార్టీ దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉంది. భంగపాటును చవిచూస్తూనే ఉంది. అయితే 2019ఎన్నికల్లో కడప గడపలో జెండా పాతాలని పట్టుదలతో ఉంది టీడీపీ. ఇందుకోసం పక్కా వ్యూహాన్ని ఎన్నికలకు ముందుగానే సిద్దం చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానించి ఏకంగా మంత్రిని చేయడం బాబు వ్యూహాంలో భాగమే.ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా బరిలోకి దింపడంతో ఈ జిల్లాలపై పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అవినాష్‌రెడ్డికి ఉన్న ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బుద్వేలు, పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. ఈ జిల్లాలో ఎంపీ సీటు నెగ్గడానికి మహిళ ఓట్లే కీలకం. కడప ఎంపీ స్థానం పరిధిలో 14,56,623 ఓటర్లు ఉంటే... వారిలో మహిళా ఓటర్లు 7,36,916 మంది ఉన్నారు. పురుషులు 7,19,478 మంది ఉన్నారు.దీంతో ఇప్పటికే పసుపు కుంకుమ పథకం విజయవంతం కావడంతో టీడీపీ ఈ మహిళా ఓట్లు తమకే పడతాయని ఆశాభావంతో ఉంది. మరోవైపు వైసీపీ కూడా ఎప్పటిలాగే తమ అధిపత్యానికి ఎవరు గండి కొట్టలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. మొత్తానికి కడపలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గట్టిపోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.