వరంగల్, మార్చి 29, (way2newstv.com)
రాష్ట్రంలో కొత్తగా మరిన్ని ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అవకాశం లేదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి స్పష్టం చేసారు. ఈ విషయంలో అటు ఏఐసిటిఇ, ఇటు జెఎన్‌టియు, ఉన్నత విద్యామండలి ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే సరైన వౌలిక సదుపాయాలు, భోదనా వసతులులేక అడ్మిషన్లు జరగని కారణంగా రాష్ట్రంలో 150 ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడ్డాయని, మరికొన్ని కళాశాలలు కూడా మూతపడే అవకాశం ఉందని చెబుతు, ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ఇంజనీరింగ్ కళాశాలు మంజూ రు చేయడానికి బదులు ఉన్న కళాశాలలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని చెప్పారు.
ఈ ఏడాదికి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ల్లేవ్..
ఇంజనీరింగ్ కళాశాలల మంజూరులో పాటించవలసిన కఠిన నిబంధనలు, సదుపాయాలు, సిలబస్ రూపకల్పన తదితర అంశాలను చర్చించేందుకు శనివారం దక్షిణాది రాష్ట్రాల స్థాయి సదస్సును హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు.రాష్ట్రంలో ఉన్నతవిద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు 400 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించిందని చెప్పారు. వీటితో భవనాల నిర్మా ణం, వౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.ఇప్పటి వరకు మెస్‌చార్జీల కింద యూనివర్సిటీల విద్యార్థులకు కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తుండటంతో మెస్‌ల నిర్వహణ యూనివర్సిటీలకు భారంగా మారిందని చెప్పారు. దీనిని దృష్టి లో పెట్టుకుని ప్రభుత్వం మెస్‌చార్జీలను 15 వందల రూపాయలకు పెంచిందని, దీనివల్ల యూనివర్సిటీలలో మెస్‌ల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. మెస్‌చార్జీల కింద వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన సుమారు 40కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఒకేసారి భారీ మొత్తంలో మెస్‌చార్జీలను పెంచడం ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదని అన్నారు