ఇసుక వ్యవహారంలో కాంట్రాక్ట్ సంస్థలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇసుక వ్యవహారంలో కాంట్రాక్ట్ సంస్థలు

రాజమండ్రి, మార్చి 12, (way2newstv.com)
ప్రభుత్వ నిధులతో చేపట్టే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఉచితంగా అందిస్తున్న ఇసుక వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నట్టు అరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పనులకు అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఆయా కాంట్రాక్టు సంస్థలకు ఉచితంగా కేటాయిస్తోంది. ఈ విధంగా గోదావరి జిల్లాల్లో పలు ర్యాంపుల నుంచి నిర్దేశిత మొత్తాల్లో ఇసుకను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రభుత్వ గృహ సముదాయాలకు, పలు ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక కేటాయించింది. నిర్దేశిత ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక తరలించుకోవచ్చని ఆయా పనులుచేస్తున్న సంబంధిత కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం సూచిస్తోంది. గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున వివిధ పనుల పేర్లతో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకకు అనుమతి తెచ్చుకోవడంతో సందట్లో సడేమియా అన్నట్టు ప్రభుత్వం నిర్దేశించిన ర్యాంపుల్లోంచి పెద్ద ఎత్తున ఉచిత ఇసుక పక్కదారి పడుతోందని తెలుస్తోంది. ఇసుక ర్యాంపుల్లో ఏ మేరకు ఇసుక లభిస్తుందన్న అంచనాల్లోనే తేడాలు చూపించడంతోనే అసలు మతలబు వుందని తెలుస్తోంది. సాధారణంగా ఇసుక ర్యాంపుల్లో ఎంత ఇసుక లభిస్తుందనే విషయాన్ని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తారు. ఆమేరకు ఇసుకను తరలించే విధంగా మైనింగ్ శాఖ పర్యవేక్షిస్తుంది. 



ఇసుక వ్యవహారంలో కాంట్రాక్ట్ సంస్థలు 

అయితే ఆయా ర్యాంపుల్లో ఎంత ఇసుక తరలిస్తున్నారనే విషయంపై ఇరు శాఖల పర్యవేక్షణా కన్పించడంలేదు. అలాగే పనులు జరుగుతున్న ప్రాంతానికి దూరంగావున్న ర్యాంపుల్లో ఇసుక కేటాయింపు జరిగితే రవాణాలో జాప్యం, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు భరించలేక కొందరు కాంట్రాక్టర్లు సమీపంలోని ర్యాంపుల్లో ఇసుక కొనుగోలు చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఇందుకు బిల్లులు పెట్టుకుంటున్నప్పటికీ, సంబంధిత సంస్థకు కేటాయింపు జరిగిన ర్యాంపులో ఆ సంస్థ పేరుతో ఇసుక మరో విధంగా తరలిపోతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి ప్రభుత్వం ఆయా పనులకు సంబంధిత కాంట్రాక్టు సంస్థకు కేటాయించిన తర్వాత పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వ పనుల ముసుగులో అధికారిక రాచబాటలోనే ఉచిత అక్రమంగా తరలిపోతోందని తెలుస్తోంది. వాస్తవానికి ఇసుక ర్యాంపుల్లో బాట చార్జీలు, లోడింగ్ చార్జీలు తీసుకుని ఇసుకను ఉచితంగా ట్రాన్స్‌పోర్టు భరించి ఎవరైనా పొందవచ్చు. అయితే ఎక్కడా ఇసుక ఉచితంగా సామాన్యుడికి లభించడం లేదు. ఒక పెద్ద లారీ లోడు కలిగిన ఐదు యూనిట్ల ఇసుక బయట మార్కెట్లో రూ.25 వేల నుంచి 30 వేలకు కొనుగోలు చేసుకునే పరిస్థితి వుంది. గోదావరి జిల్లాల్లో ప్రధానంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోనూ, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోనూ పెద్ద ఎత్తున ప్రభుత్వ పనులకు ఉచిత ఇసుక కాంట్రాక్టు సంస్థలకు కేటాయింపు జరిగింది. ఈ రెండు డివిజన్ల తర్వాత అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో కాస్తంత తక్కువ స్థాయిలో కేటాయింపు జరిగింది. ప్రధానంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో పరిశీలిస్తే 12 లక్షల 82 వేల 899 క్యూబిక్ మీటర్ల ఇసుక ప్రభుత్వ పనులకు ఉచితంగా కేటాయించారు. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా గృహ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టు సంస్థలకు అధిక మొత్తంలో ఇసుక కేటాయింపు జరిగింది. అదే విధంగా పోలవరం పనులకు కూడా కేటాయించారు. ఒక్కో సంస్థకు దాదాపు 50 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున కేటాయించిన ర్యాంపులు కూడా వున్నాయి.