అమరావతి, మార్చి 23 (way2newstv.com)
వైకాపా అధ్యక్షుడు త జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తి అనడానికి అఫిడవిట్ లో పేర్కోన్న కేసులే నిదర్శనమని, ఎవరి అఫిడవిట్ లోనూ ఇన్ని కేసులుండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ… 48 పేజీలలో 31 కేసులు జగన్ నేరచరిత్రకు రుజువులని అన్నారు. దేశంలో ఎవరి అఫిడవిట్లోనూ ఇన్ని కేసులు ఉండవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిన్నాన్న హత్యలోనూ రాజకీయ లాభాలు చూడటం నీచాతినీచమని అన్నారు.
ఇన్ని కేసులున్న వ్యక్తికి ఓటు వేస్తారా
31 కేసులు ఉన్న వ్యక్తికి, హత్యారాజకీయాలు చేసే వ్యక్తికి ఎవరైనా ఓటేస్తారా అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేసీఆర్, మోదీకి జగన్ బానిసగా మారారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఒత్తిడితోనే వివేకా కూతురు కూడా తండ్రి చావుని రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారని అన్నారు. కేసీఆర్, మోదీలకు జగన్ బానిసగా మారారని, వీరంతా ఆంధ్రాద్రోహులని ధ్వజమెత్తారు. ఆంధ్రా ద్రోహులకు ఓటుతో తగిన బుద్ధిచెప్పి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం సభల్లో ప్రజల ఉత్సాహం ఉరకలేస్తోందని, అంతటా తెదేపా పట్ల సానుకూలత కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.