అమరావతి, మార్చి 13, (way2newstv.com)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా చెప్పినట్లు వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలను బుధవారం నుంచి ఈ నెల 16కు వాయిదా వేశారు. పార్టీలో చేరికల కారణంగా ఈరోజు ముహూర్తం దాటిపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 16న ఇడుపులపాయలో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే రోజున వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సీపీ అభ్యర్థుల ప్రకటన వాయిదా
వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో తొలి విడత అభ్యర్థుల జాబితాను బుధవారం ఉదయం 10.20 గంటలకు ప్రకటించనున్నారని ముందుగా ప్రకటించారు. మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు గాను తొలి విడతలో 100 ఎమ్మెల్యే, 15 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలని జగన్ నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, చివరి నిమిషంలో దీనిని వాయిదా వేశారు. వైకాపా కేంద్ర కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మార్చి 16 ఉదయం 10.26 గంటలకు ఇడుపులపాయనుంచి జగన్ బస్సుయాత్ర, ప్రచారం ప్రారంభిస్తారని పేర్కోంది. అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో మార్చి 16నే విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.