హైదరాబాద్, మార్చి 11, (way2newstv.com)
ప్రముఖ సినీ నటుడు అలీ సోమవారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత, వైఎస్ జగన్ మోహన రెడ్డి సమక్షంలో.. సోమవారం ఉదయం అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. నిన్న మొన్నటి వరకూ కూడా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందరికీ షాకిచ్చిన అలీ సడన్ గా వైసీపీ గూటికి చేరుతుండటం గమనార్హం.
ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం మాత్రం చేస్తా: అలీ
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అలీ మాట్లాడుతూ ‘‘జగన్ వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు నమ్ముతున్నారు. నేను ఆయన్ని గతంలో కలిసి మాట్లాడాను. ఆయన నన్ను రమ్మని ఆహ్వానించారు.. కానీ నేనే కొంత సమయం కావాలని కోరాను. 1999లో ఓ పార్టీ కండువా కప్పుకున్నాను. మళ్లీ 2019 ఈ పార్టీ కండువా కప్పుకున్నాను. కచ్చితంగా మంచి మెజారిటీతో జగన్ని సీఎం చేయడమే నా ధ్యేయం అని అలీ అన్నారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. కేవలం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని అలీ స్పష్టం చేశారు. అయితే ఒకవేళ జగన్ తనకు రాజమండ్రి కానీ విజయవాడ టికెట్ ఇస్తే.. తప్పకుండా పోటీ చేస్తానని అలీ పేర్కొన్నారు.