తూర్పులో టీడీపీ యువదళం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తూర్పులో టీడీపీ యువదళం

కాకినాడ, మార్చి 21, (way2newstv.com)
రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరిలోని మూడు లోక్‌సభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ ‘యువ’ దళాన్ని ఎన్నికల బరిలోకి దింపింది. తొలిసారిగా రాజకీయరంగప్రవేశంతో పాటు విద్యావంతులు, టెక్నాలజీపరంగా నిష్ణాతులు, ప్రజలను ఆకర్షించే చురుకైన స్వభావం కలిగిన ముగ్గురిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. ఒకరు తండ్రి వారసత్వంతో రాజకీయ అరంగేట్రం చేస్తే ఇంకొకరు మామయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. మరొకరు రాజకీయ ప్రస్థానంలో విజయం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. వారే అమలాపురం, రాజమహేంద్రవరం, కాకినాడల నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న గంటి హరీష్‌, మాగంటి రూప, చలమలశెట్టి సునీల్‌. తెలుగుదేశం పార్టీ జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు విద్యావంతులైన యువతను ఎంపిక చేసింది. రాజమహేంద్రవరం స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ కోడలు రూపను బరిలోకి దింపారు. అమలాపురం రిజర్వుడు లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ దివంగత స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌ మాధుర్‌ టిక్కెట్‌ దక్కించుకున్నారు. మొదటి దళిత స్పీకర్ గా జీఎంసీ బాలయోగికి అవకాసం ఇచ్చి, దేశ చరిత్రలోనే నవసకానికి చంద్రబాబు నాంది పలికిన విషయం తెలిసిందే. ఇక చలమలశెట్టి సునీల్‌ మరోసారి తన రాజకీయ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు కాకినాడ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్నారు. 


తూర్పులో  టీడీపీ యువదళం

కసరత్తులపై కసరత్తులు చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ముగ్గురికీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. రాజకీయపరమైన ఒత్తిళ్లను సైతం అధిగమించి ఆశావహుల అనూహ్యమైన పోటీ మధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత వీరి పేర్లను ఖరారు చేశారు. బాలయోగి తనయుడు హరీష్‌మాధుర్‌ తన తండ్రికి కోనసీమలో ఉన్న పలుకుబడితో రాజకీయ అరంగేట్రం చేశారు. మామయ్య మురళీమోహన్‌ రాజకీయ అనుభవాన్ని పుణికిపుచ్చుకున్న కోడలు రూప రాజమహేంద్రవరం నుంచి రంగంలోకి దిగారు. కాకినాడ లోక్‌సభకు మొదటిసారి ప్రజారాజ్యం, రెండోసారి వైసీపీ నుంచి పోటీచేసిన చలమలశెట్టి సునీల్‌ ఈసారి అనూహ్యమైన రీతిలో టీడీపీ నుంచి బరిలో వున్నారు.అమలాపురం అభ్యర్థి హరీష్‌ బీబీఎం పూర్తిచేసి ఐటీ రంగంలో స్థిరపడ్డాడు. తన సాంకేతక నైపుణ్యంతో కొంత కాలంగా టీడీపీ కార్యాలయంలో విశేషమైన సేవలందించారు. తండ్రి బాలయోగి వారసునిగా తొలిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాకినాడ అభ్యర్థి సునీల్‌ ఉన్నత విద్యా కుటుంబం నుంచి వచ్చారు. ఫ్రాన్స్‌లోని షిల్లెర్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీలో బ్యాచిలర్స్‌ డిగ్రీ కింద ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ కోర్సు పూర్తి చేశారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అపార అనుభవం వుంది. రాజమహేంద్రవరం అభ్యర్థిని రూప బీఏ (కార్పొరేట్‌ అండ్‌ సెక్రటరియేట్‌ గ్రూప్‌), డిప్లొమా ఇన్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డవలప్‌మెంట్‌ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్‌ సైకాలజీని యూఎస్‌లోని అరిజోనా యూనివర్శిటీలో (ఫినిక్స్‌ సిటీ) చదివారు. అయితే ఈ ముగ్గురికీ రాజకీయంగా అనుభవం లేనప్పటికీ విద్యాపరంగా ఎంతో అనుభవజ్ఞులు. ముఖ్యంగా జిల్లాలోని ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నవారు. స్పష్ణమైన ప్రణాళికతో ప్రచారంలోకి దిగుతున్నారు.