అంతా అపరిశుభ్రమే.. (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అంతా అపరిశుభ్రమే.. (గుంటూరు)

గుంటూరు, మార్చి 4  (way2newstv.com): 
జిల్లాలోని ఎక్కడపడితే మున్సిపాలిటీల్లో అక్కడ జంతువధలకు పాల్పడుతూ ప్రజలకు అసౌకర్యం కల్పించడమే కాకుండా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు మాంసం విక్రేతలు. పశువైద్యాధికారుల ధ్రువీకరణతో జంతు కబేళాల్లో చేయాల్సిన వాటిని రహదారుల పక్కనే కానిస్తూ జుగుప్సాకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఉన్న వధశాలలు పేరుకే పరిమితమయ్యాయి.
ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా పట్టణవాసులకు నాణ్యమైన మాంసం విక్రయాలు జరిగేలా ప్రభుత్వం పలు నిబంధనలు రూపొందించింది. ప్రతి పురపాలికలో గొర్రెలు, మేకలు, దున్నపోతులు, పందులకు వేర్వేరుగా వధశాలలను ఏర్పాటు చేయాలి. పశువైద్యాధికారి ధ్రువీకరించిన తర్వాతే వాటిని అక్కడ వధించి మాంసాన్ని తీసుకెళ్లి దుకాణాల్లో విక్రయించాలి. రోగాల బారిన పడిన వాటి మాంసాన్ని విక్రయించరాదు. తాజా మాంసాన్నే అమ్మాలి. ఎక్కడపడితే అక్కడ వాటి వ్యర్థాలను పడేయరాదు. అయితే ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. ఆదివారం వచ్చిందంటే భారీస్థాయిలో మాంసం విక్రేతలు అమ్మకాలు సాగిస్తుండగా నెల మొత్తం మీద రూ.కోటిన్నరకుపైగా వ్యాపారం ఉంటుందని అంచనా. 


అంతా అపరిశుభ్రమే.. (గుంటూరు)

అధికారులకు ముడుపులు ముడుతుండడంతో జబ్బు చేసిన జంతువుల వధలు జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. రహదారుల పక్కన ఎడాపెడా జంతు వధలు చేస్తున్న వారు వాటి వ్యర్థాలను పట్టణానికి దూరంగా తీసుకెళ్లి గుంత తవ్వి దానిలో వేసి కప్పివేయటం లేదా, డంపింగ్‌ యార్డుకు తరలించాల్సివున్నా ఆ విధంగా చేయక నడిబొడ్డున, శివారున రహదారుల పక్కనే పడేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత, అనారోగ్యకర వాతావరణం ఏర్పడుతోంది. కుక్కలు ఈ వ్యర్థాలకు రుచి మరిగి, అవి దొరకని పక్షంలో చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. కాగా పురపాలక శాఖే దుకాణాలు నిర్మించి అద్దెకు ఇస్తే తాము వాటిలోనే విక్రయాలు జరుపుతామని మాంసం వ్యాపారులు అంటున్నారు.
చిలకలూరిపేట వేలూరు రోడ్డులో దశాబ్దన్నర నుంచి జంతు వధశాలను వినియోగించకపోవడంతో శిథిలావస్థకు చేరింది. పశువైద్యాధికారి, పురపాలక అధికారుల పర్యవేక్షణ లేకుండానే నరసరావుపేట సెంటర్‌, చీరాల, పెదనందిపాడు వెళ్లే రహదారుల ప£క్కన వధలు బహిరంగంగానే నిర్వహిస్తున్నారు. వ్యర్థాలను పట్టణ శివారు పసుమర్రు వంతెన పక్కన ఇష్టం వచ్చినట్లు పడేస్తూ అపరిశుభ్రతకు కారణమవుతున్నారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు.
నరసరావుపేటలో జంతు వధశాల ఉన్నా ఉపయోగించడం లేదు. ఆదివారం భారీగా వ్యాపారం జరుగుతుంది. పశువైద్యుడి ధ్రువీకరణ, పురపాలక అధికారుల పరిశీలన లేకనే వ్యాపారులు పల్నాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో రహదారుల పక్కనే గొర్రెలు, మేకలు, పందులు, పశువులను విచ్చలవిడిగా వధిస్తూ వాటి వ్యర్థాలను అక్కడే పడేస్తున్నారు. మాచర్లలోనూ జంతు వధశాల లేదు. ప్రభుత్వ వైద్యశాల రహదారి, రింగు రోడ్డు నుంచి రైల్వేస్టేషన్‌ ట్రాక్‌ వరకు బయటే జంతువులను కోసి మాంసం విక్రయిస్తున్నా పురపాలక అధికారలు పట్టించుకోవడం లేదు.
పిడుగురాళ్లలో అధికారులు కబేళా నిర్మించలేదు. ఎవరి పర్యవేక్షణ లేకుండానే ఆసుపత్రి మార్గం, గుంటూరు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ క్రాస్‌ రోడ్డు, జానపాడు, పిల్లుట్ల రహదారి, బట్టీల సమీపంలో జంతువులను వధించి మాంసం విక్రయాలు చేస్తున్నారు. వినుకొండలో జంతు వధశాల ఉండగా ఆదివారం తెల్లవారుజూమున కొన్ని జంతువులు కోసి దుకాణాలకు తరలించి మాంసాన్ని విక్రయిస్తున్నారు. పశుసంవర్థక శాఖ కాంపౌండర్‌ అప్పుడప్పుడు మాత్రమే వచ్చి తనిఖీలు చేసి వెళ్తున్నారు. దున్నపోతులు, పందులు, గాడిదలను రహదారుల పక్కనే కోస్తున్నారు. ఇక్కడా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేకుండా పోయింది.
రేపల్లెలో జంతు వధశాల లేదు. దాంతో పట్టణంలో రహదారుల పక్కనే జంతువులను కోసి మాంసం విక్రయిస్తున్నారు. పశువైద్యుడు, పురపాలక అధికారల ధ్రువీకరణ, పర్యవేక్షణ ఉండటం లేదు. వ్యర్థాలను దూరంగా పడేయట్లేదు.బాపట్లలోని జమ్ములపాలెం రోడ్డులో నిర్మించిన జంతు వధశాల మూడేళ్లకే దెబ్బతింది. ప్రతి ఆదివారం ఉదయం కొన్ని గొర్రెలు, మేకలను మాత్రమే తీసుకువచ్చి కోసి మాంసం తీసుకెళ్తున్నారు. పశువైద్యాధికారి ధ్రువీకరించపోయినా పురపాలక సిబ్బందే ఈ మాంసం తినవచ్చంటూ రబ్బరు స్టాంపులు వేసి పంపుతున్నారు. తూర్పు సత్రం, సూర్యలంక రోడ్డు, అక్బరుపేట వద్ద ఉప్పరిపాలెం రోడ్డులో, జమేదారుపేటలో ఆరుబయటే విక్రయాలు జరుగుతున్నాయి. గాడిద, పందులను నడిరోడ్డు మీదే కోసి వ్యర్థాలను రోడ్ల పక్కనే పడేస్తున్నారు. కోళ్ల వ్యర్థాలను మార్కెట్‌ యార్డు, పారిశ్రామికవాడలో శివారున పడేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతం దుర్వాసన వెదజల్లుతుంది.