తప్పని ముప్పు (నిజామాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తప్పని ముప్పు (నిజామాబాద్)

నిజామాబాద్, మార్చి 18 (way2newstv.com): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో భూగర్భ జలాలు వేసవి ఆరంభంలోనే ప్రమాదకర స్థితికి చేరాయి. గతేడాదితో పోలిస్తే దారుణంగా పడిపోయాయి. దీంతో బోరు బావుల కింద వేసిన పంటలకు నీరందడం కష్టంగా మారింది. రానున్న రోజుల్లో కరవు ఛాయలను చవిచూడాల్సి వస్తుందన్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
బోధన్‌, బాన్సువాడ ప్రాంతాల్లో నిజాంసాగర్‌ ఆయకట్టు ఉన్నప్పటికీ ప్రాజెక్టు నుంచి జలం రాని పరిస్థితి. కానీ బోర్ల కింద వ్యవసాయం చేస్తున్నారు. ఖరీఫ్‌లో అనుకూలంగా ఉండటంతో కొంత అటు.. ఇటుగా అదే విస్తీర్ణంలో రబీలోనూ పంటలు వేశారు. ఈ ప్రాంతంలో ఉన్న బోర్ల సంఖ్యకు తోడు అధిక విస్తీర్ణంలో వరి సాగు కారణంగా నీటి వినియోగం అధికంగా ఉండటంతో.. ప్రస్తుతం బోర్లు చుక్క నీటిని రాల్చటం లేదు. వట్టి పోవటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటను తడుపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.


తప్పని ముప్పు (నిజామాబాద్)

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాల్వలు ఉన్న ప్రాంతాలతో పాటు అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాల ఆయకట్టులోనూ వరి పెద్ద ఎత్తున వేశారు. ఎస్సారెస్పీ ఆయకట్టులో వారబందీ పద్ధతిన నీరందిస్తున్నారు. ఈ నెలాఖరుతో సరఫరా నిలిపి వేయనున్నారు. కానీ ఆ సమయానికి పంట పొట్ట దశలో ఉంటుంది. ఆఖరు తడులు అందించ లేని స్థితిలో గింజ ఏర్పడని పరిస్థితుల్లో దిగుబడులు తగ్గుతాయనే ఆందోళన రైతుల్లో నెలకొంది. దీనికి తోడు నీరు వదిలిన సందర్భాల్లోనూ చివరి భూముల వరకు అందక చాలా మట్టుకు నేలలు బీడ్లు బారుతున్నాయి.
బాల్కొండ, నిజామాబాద్‌ గ్రామీణం, బోధన్‌, బాన్సువాడ శివారులోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ఏకంగా 10 నుంచి 15 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. పంటలకు నీటి వినియోగంతో పాటు గోదావరి పరీవాహకంలో ఇసుక తవ్వకాల కారణంగా కూడా జలమట్టాలు పడిపోయినట్లుగా భావిస్తున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై పర్యవేక్షణ లేకపోవటం కూడా భూగర్భ జలాలు ప్రమాదకర స్థితికి చేరుతున్నాయని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. భీమ్‌గల్‌, సిరికొండ ప్రాంతాల్లో ఇప్పటికే బోర్ల నుంచి నీరు రావటం లేదంటున్నారు. కొత్తగా బోర్లు వేస్తున్నా నీరు పడటం లేదు. ఒక్కొక్కరు నాలుగైదు సార్లు ప్రయత్నించి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు కొనసాగుతున్నాయి.