యాప్ సేవలతో విద్యుత్ భారమే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

యాప్ సేవలతో విద్యుత్ భారమే

నెల్లూరు, మార్చి 5, (way2newstv.com)
వినియోగదారులపై విద్యుత్‌ శాఖ డిజిటల్‌ చెల్లింపులను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. విద్యుత్‌ బిల్లులను డైరెక్ట్‌గా కట్టించుకోకుండా యాప్‌లలో, ఆన్‌లైన్‌లో చెల్లించాలని విద్యుత్‌ కార్యాలయాలకు వెళ్లినా వినియోగదారులను వెనక్కు పంపుతోంది. ఆన్‌లైన్‌, యాప్‌ల ద్వారా చెల్లింపులు పెంచి ప్రైవేట్‌ సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తూ వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తోంది. క్రేడిట్‌ కార్డు, వ్యాలెట్‌ కార్డు, యాప్‌ల ద్వారా చెల్లిస్తున్న వినయోగదారులు బిల్లుతో పాటు అదనంగా 1 నుంచి 3 శాతం సర్వీస్‌ చార్జీల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆన్‌లైన్‌ బిల్లుల చెల్లింపుల ద్వారా ఉద్యోగులను తగ్గించుకోవాలనే శాఖ ఆలోచన. ఇందులో భాగంగానే వినియోగదారులను డిజిటల్‌ చెల్లింపుల వైపు మళ్లించాలని విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. 


యాప్ సేవలతో విద్యుత్ భారమే

రూ.5వేలు దాటిన బిల్లులను ఆన్‌లైన్‌ ద్వారా గానీ, యాప్‌ల ద్వారా గానీ చెల్లింపులు జరిగేలా చూడాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్లో రూ.5వేలు ఉన్నా అమలులో మాత్రం రూ.500లు దాటిన బిల్లులను కూడా ఆన్‌లైన్‌వైపు మళ్లించాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కొన్ని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాల వద్ద రూ.500లు దాటిన బిల్లులను కూడా తీసుకోవడం లేదు. ఫోన్‌ పే, పేటిఎం, తేజ్‌ వంటి యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించుకోవాలని ఉద్యోగులు చేతులెత్తేస్తున్నారు. బిల్లు గడువు దాటితేనే అదనపు రుసుం చెల్లించాల్సిన వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపుల ద్వారా సకాలంలో చెల్లించినా అదనపు రుసుం చెల్లించాల్సి వస్తోంది. రూ.5 నుంచి రూ.10వేల వరకు విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సిన వినియోగదారులపై డిజిటల్‌ చెల్లింపుల వల్ల రూ.200లు అదనపు భారం పడుతోంది. ఎపిఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో డిజిటల్‌ చెల్లింపుల వల్ల నెలకు రూ.20లక్షలు వినియోగదారులు అదనంగా చెల్లిస్తున్నారు. విజయవాడ, తిరుపతిలో 30శాతం వినియోగదారులు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తున్నారు. వినియోగదారులను డిజిటల్‌ చెల్లింపుల వైపు మళ్లిస్తే ప్రోత్సాహకం అందిస్తామని విద్యుత్‌ శాఖ కాంట్రాక్టు మీటర్‌ రీడర్లకు ప్రకటించింది. ఇంటింటికీ తిరిగి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి వినియోగదారుల చేత బిల్లు కట్టిస్తే రూ.10లు ప్రోత్సాహకం అందించేందుకు సిద్ధమైంది.