కరీంనగర్, మార్చి 23,(way2newstv.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎంపీ వివేక్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ నమ్మించి గొంతు కోశారని ధ్వజమెత్తారు. శుక్రవారం ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో వివేక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించా. పెద్దపల్లి పరిధిలో టీఆర్‌ఎస్ పార్టీకి జీవం పోసింది నేనే. నా పేరు లోక్ సభ అభ్యర్థుల జాబితాలో లేకపోవడం బాధాకరం.
కేసీఆర్ పై మాజీ ఎంపీ వివేక్ తీవ్ర ఆరోపణలు
టీఆర్‌ఎస్‌లో నేను ఎవరినీ మోసం చేయలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు నాపై తప్పుడు సమాచారం ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెడతానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నం చేశానని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బానిస సంకెళ్ళు తెగాయని చెప్పారు. తనకు ఇతర పార్టీల నుంచి ఆహ్వానం ఉందని వ్యాఖ్యానించారు. ఇక ప్రజల మధ్యే ఉంటానని స్పష్టంచేశారు. ప్రజల నిర్ణయం ప్రకారమే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.