కడప, మార్చి 23 (way2newstv.com)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఆస్తి తగాదాలే కారణమా? అనుచరులే ఆయన్ని చంపేశారా? పోలీసులు ఈ అంశాలనే దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. పరమేశ్వర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధారులైతే.. పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. మరో పక్క, ఈ కేసులో జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్ననే కడప పార్లమెంట్ ఆర్జేడీ అభ్యర్థిగా శివశంకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇప్పటికే శివశంకర్‌రెడ్డిని పోలీసులు రెండు సార్లు విచారించారు. కేసులో మరో ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఓ స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 40 మందిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు.
వివేక హత్య కేసులో ఇంటి దొంగలు
కేసు కొలిక్కి వస్తుండటంతో ఒకటి రెండురోజుల్లోనే అధికారికంగా అరె్‌స్టలు చూపించే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పులివెందులలో ఈ నెల 15న వివేకా హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే చంపేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఇది ఇంటి దొంగల పనేనని, ఇందులో తమకెలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు ప్రకటించారు. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో సిట్‌తోపాటు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ నేతృత్వంలోని 12 పోలీస్ బృందాలు హంతకుల వేటలో ఉన్నాయి.హత్య జరిగిన రాత్రి 11.30గంటల ప్రాంతంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో అతను పులివెందులలో తిరిగినట్లు సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీని ఆధారంగా పోలీసులు చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఓ న్యాయవాది వద్ద గుమస్తాగా పనిచేస్తూ చట్టంలోని లొసుగులు తెలుసుకుని హత్యలకు పాల్పడేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే.. పోలీసులు అదుపులోకి తీసుకోకముందు పరమేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. హత్య ఇంటి దొంగల పనే అని పేర్కొంటూ.. ఆ ఇంటి దొంగలెవరో త్వరలోనే తెలుస్తుందని నర్మగర్భంగా చెప్పారు. పరమేశ్వర్‌రెడ్డికి ఈ హత్య గురించి తెలుసుకాబట్టే అలా అన్నాడని, విచారణలో ఆ మేరకు పోలీసులు వివరాలు సేకరించారని తెలుస్తోంది.