విశాఖలో పార్టీల ప్రయోగాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విశాఖలో పార్టీల ప్రయోగాలు

అయోమయంలో అభ్యర్థులు
విశాఖపట్టణం, మార్చి 7, (way2newstv.com)
విశాఖ జిల్లాలో అధికార తెలుగుదేశం, విపక్ష వైసీపీ రాజకీయం పార్టీ క్యాడర్ కి అంతుపట్టడంలేదు. రెండు పార్టీలు గెలుపే టార్గెట్ గా కసరత్తు చేస్తున్నా తమ పార్టీ నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ఓ వైపు అభ్యర్ధుల పేర్లు అనధికారికంగా బయటకు వస్తూంటే అంతే స్థాయిలో అసమ్మతి కూడా రాజుకుంటోంది. టీడీపీలో సిట్టింగు ఎమ్మెల్యేల పట్ల బాగా వ్యతిరేకత ఉంది. అయితే దాన్ని హై కమాండ్ అసలు ఖాతర్ చేయడంలేదు. ఇక వైసీపీలో ఉన్న ఇంచార్జులను ఎప్పటికపుడు మారుస్తూ భారీ ప్రయోగాలే చేస్తున్నారు. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న వేళ రెండు పార్టీల్లోని కార్యకర్తలు మాత్రం ఎటువంటి జోష్ లేకుండా ఉండడం విశేషం.టీడీపీకి విశాఖ జిల్లాలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలుపుకుని 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వారిని తప్పించాలని ఎక్కడికక్కడ క్యాడర్ ఆందోళన చేస్తోంది. మరో వైపు తమకు ఈసారైనా చాన్స్ ఇవ్వాలని ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గత సారి ఇచ్చిన మాటేంటని వారు అంటూంటే పాతవారితో సర్దుకుపొమ్మని హై కమాండ్ సంకేతాలు పంపుతోంది. దీంతో వీధుల్లోకి వచ్చి మరీ నిరసన ప్రదర్శనలు చేశారు, మీడియా మీటింగులు పెట్టారు. ఏకంగా అధినాయకులను కలసి మనసులో మాటను విన్నవించుకున్నారు. అయినా సరే సిట్టింగులకే టీడీపీ పెద్ద పీట వేస్తోంది. ఈ పరిణామంతో ఇపుడు పసుపు పార్టీ తమ్ముళ్ళు నిరాశలో నిండా మునిగిపోయారు. 


విశాఖలో పార్టీల ప్రయోగాలు

వారికి సీట్లుఇ ఇస్తే గెలవరని కూడా చెప్పినా పోటీకి పెడితే తామేం చేయలేమని పార్టీలోని ద్వితీయ స్థాయి నేతలు అనడం విశేషం.నిజానికి సిట్టింగులను మార్చాలని అధినాయకత్వం ముందు అనుకుందట. అయితే పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైసీపీలో చేరిపోవడంతో హడలిపోయిన నేపధ్యంలో ఈసారికి సిట్టింగులే శరణ్యం అనుకుంటోందని చెబుతున్నారు. మొదట సగానికి సగం మందికి టికెట్లు దక్కవని వచ్చిన వార్తల ప్రకారం ఆశావహులు రేసులోకి వచ్చేశారు. దీంతో ఇపుడు ఇలా హై కమాండ్ ప్లేట్ ఫిరాయించేసరికి వారు గుస్సా అవుతున్నారు. కాగా మరో రెండు మూడు రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా వస్తుందని తెలుస్తోంది. అపుడు అసలైన రచ్చ జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వైసీపీలో తీరు మరోలా ఉందంటున్నారు. ఆ పార్టీ పూటకొక అభ్యర్ధిని తెర మీదకు తెస్తోంది. దాంతో పాత వారు ఏకంగా పక్కకే పోతున్నారు. పార్టీని వదిలేసి మరీ దూరమవుతున్నారు. ఎన్నికలు నువ్వా నేనా అని ఉన్న వేళ ఇలా జరగడం పార్టీకి చేటు తెస్తుందని సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటికైనా పార్టీకి ఫ‌లనా వారు అభ్యర్ధులు అని చెప్పి ఖరారు చేస్తే వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టగలమని అంటున్నారు. అయితే ఏ రోజుకు ఆ రోజు వస్తున్న మార్పులకు అనుగుణంగా అధినాయకత్వం వైసీపీలో అభ్యర్ధులను మార్చేస్తోంది. దీంతో వైసీపీలో పూర్వపు జోష్ మాత్రం కనిపించడంలేదు. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత ప్రకటించిన వారే అసలైన అభ్యర్ధి అవుతారని భావిస్తున్నారు. అంతవరకూ అయోమయం తప్పదని అంటున్నారు.