జగన్‌ ఇంకెన్నో వేషాలు వేస్తారు జాగ్రత్త: చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్‌ ఇంకెన్నో వేషాలు వేస్తారు జాగ్రత్త: చంద్రబాబు

తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని పిలుపు
16వ తేదీన తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావం
అమరావతి మార్చ్ 13 (way2newstv.com)    
 ఫారం-7 దుర్వినియోగంలో అడ్డంగా దొరికిపోయిన జగన్.. ఇప్పుడు తన ఓటే తొలగించే ప్రయత్నం జరిగిందంటూ నాటకాలాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. ఇంకా ఎన్నో విచిత్ర వేషాలు జగన్ చూపిస్తారని, వాటిని భరిస్తూ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వాస్తవ పరిస్థితులపై తీసుకుంటున్న ప్రజాభిప్రాయంలో తెలుగుదేశానికి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని వెల్లడించారు. 18వ తేదీ నుంచి లబ్ధిదారులే వచ్చి తోచిన విధంగా తెలుగుదేశానికి ప్రచారం చేసే పరిస్థితి ఉందని తెలిపారు. ఈ మేరకు పార్టీ నేతలతో చంద్రబాబు బుధవారం టెలికాన్ఫరెన్స్‌ లో నిర్వహించారు.తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని పసుపు సైనికులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 


జగన్‌ ఇంకెన్నో వేషాలు వేస్తారు జాగ్రత్త: చంద్రబాబు

హెలికాఫ్టర్ గుర్తును చూసి కూడా ఫ్యాన్ గుర్తేమో అని భయపడే పరిస్థితుల్లో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. మోదీ, జగన్, కేసీఆర్ అనుబంధం మరోమారు ఈడీ మాజీ డైరెక్టర్ సీబీఐకి రాసిన లేఖ ద్వారా బట్టబయలైందని చంద్రబాబు అన్నారు. ఈ కుట్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈడీ లేఖపై వైకాపాను నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కును తాకట్టు పెట్టే కుట్రను ఎండగట్టి తీరాలని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. అభ్యర్థుల ఖరారు తర్వాత కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నాని, క్షేత్రస్థాయిలో నాణ్యమైన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని వెల్లడించారు. అవతల పార్టీ మాదిరి డబ్బులకు కక్కుర్తి పడి అభ్యర్థుల్ని మార్చే పద్ధతి తెలుగుదేశానిది కాదని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం సరిగా లేకుంటే అభ్యర్థుల్ని మార్చడానికి వెనుకాడనని హెచ్చరించారు.16వ తేదీన తిరుపతి నుంచి ఎన్నికల శంఖం పూరించి అదే రోజు శ్రీకాకుళంలో పర్యటించనున్నట్లు చెప్పారు. మరుసటి రోజున విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. తర్వాతి దశలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తిరగనున్నట్లు వెల్లడించారు. చివరిదశలో కర్నూలు, కడప, అనంతపురంలో తన పర్యటన ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు.