కర్నూలు మార్చ్ 19 (way2newstv.com):
కర్నూలుకు చెందిన నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెదేపాలో చేరనున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో సొంతగూటికి చేరుకోనున్నారు. గతంలో తెదేపాలో ఉన్న ఆయన రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీని వీడారు. అనంతరం రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో ఓ పార్టీని కూడా నెలకొల్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన తెదేపా అధిష్ఠానంతో మంతనాలు జరుపుతున్నారు.
టీడిపి లోకి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి?
కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే, ప్రస్తుత తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి తెదేపా అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. తాను ఆ స్థానం నుంచి బరిలోకి దిగితే అటు అసెంబ్లీ స్థానంలో గెలవడంతో పాటు.. ఇటు తెదేపా లోక్‌సభ అభ్యర్థి గెలుపునకు కూడా లాభిస్తుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై అధిష్ఠానం నిర్ణయం వెలువడాల్సి ఉంది. చర్చలు సఫలమైతే రేపు లేదా ఎల్లుండి తెదేపాలో బైరెడ్డి చేరే అవకాశం ఉంది.