పాడిపై పిడుగు (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాడిపై పిడుగు (కరీంనగర్)

కరీంనగర్, మార్చి 8 (way2newstv.com): 
పాడిపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు గడ్డుకాలమే ఎదురవుతోంది. అసలే డిమాండ్‌కు సరిపడా పాల ఉత్పత్తి లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా, వర్షాభావంతో మరింత ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వాగులు, వంకలు, భూగర్భజలాలు అడుగంటిపోయి పశుగ్రాసం అందకుండా పోయింది. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక రైతులు పాలిచ్చే పశువులను సంతలకు తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రోజూ 2.20 లక్షల లీటర్లలోపు మాత్రమే పాల ఉత్పత్తి జరుగుతోంది. రెండు నెలల ముందు వరకు 2.75 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరగగా ప్రస్తుతం 55 వేల లీటర్ల పాల ఉత్పత్తి తగ్గింది. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు 180 మి.లీ పాలు అవసరం.
జిల్లాలో 38 లక్షల జనాభా ఉండగా, 6.84 లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ ఇందులో మూడోవంతు పాలు మాత్రమే లభిస్తున్నాయి. 

పాడిపై పిడుగు (కరీంనగర్)

4 లక్షల గేదెలు, 75 వేల ఆవులు ఉన్నాయి. కరీంనగర్‌ మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ సంస్థ 1.45 లక్షల లీటర్లు, ముల్కనూర్‌, ప్రియ, నాగార్జున, ఇతర డెయిరీల నుంచి లక్ష లీటర్ల వరకు వస్తున్నాయి. దాణా ఖర్చులు, గ్రాసం ఖర్చులు బాగా పెరిగి పశుపోషణకు ఇబ్బందులు పడుతున్నారు. పాలిచ్చే గేదెకు రోజూ కనీసం 5 కిలోల పచ్చిగడ్డి వేయాల్సి ఉండగా, బోర్లు ఎండిపోవడంతో పచ్చిమేత దొరకని పరిస్థితి. కనిష్ఠంగా ఆవు పాలకు రూ.32, గేదె పాలకు రూ.40 లభిస్తోంది. రైతులకు మాత్రం ఒక లీటరు వెంట రూ.30కి పైగా ఖర్చవుతోంది. పాలకు ధర రావాలంటే వెన్న శాతం ఎక్కువ ఉండాలి.
పశుగ్రాసం అనుకూలత మేరకు రైతులు పాడి గేదెలకు సపర్యలు చేస్తున్నారు. ఆర్థికవనరులు, పశుగ్రాసం, దాణా వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మిగతా గేదెలను విక్రయిస్తున్నారు. ఉన్న గేదెలపై ఉష్ణోగ్రతల ప్రభావం చూపడంతో పాల ఉత్పత్తి తగ్గుతోంది. 5 లీటర్లు పాలిచ్చే గేదె లీటరు నుంచి లీటరున్నర వరకు తక్కువగా ఇస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల దిగుబడి తగ్గడానికి ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరగడం, పచ్చిగడ్డి దొరకకపోవడమే కారణమని పశువైద్యులు చెబుతున్నారు. పచ్చిగడ్డి ఉంటేనే పాల ఉత్పత్తి పెరుగుతుందన్నది నిర్వివాదాంశం. కానీ రైతులు దాణా, ఇతర రకాల మినరల్స్‌పై దృష్టి పెడుతున్నారు.