కర్పూలు, మార్చి 19 (way2newstv.com):
ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్లకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించగా జనసేన పార్టీ ఇంకా కొందరు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే టీడీపీ, వైసీపీలో టిక్కెట్లు దక్కని నేతల్లో ఎక్కువ మంది జనసేన వైపు చూస్తున్నారు. మరికొందరికి జనసేనే స్వయంగా ఆహ్వానించి టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది. గత ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన ఎస్పీవై రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈసారి తనకు టిక్కెట్ ఖాయం అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు.
జనసేన గూటికి ఎస్పీవై
తాజాగా ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో నంద్యాల ఎంపీ టిక్కెట్‌ను మాండ్ర శివానంద్‌రెడ్డికి ఇచ్చారు. దీంతో టీడీపీ తనను మోసం చేసిందని ఆవేదన చెందిన ఆయన నంద్యాల నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయనకు అనూహ్యంగా జనసేన పార్టీ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరితే నంద్యాల టిక్కెట్ ఇస్తామని జనసేన ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే తన అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఎస్పీవై రెడ్డి అనుచరుల్లో చాలామంది జనసేన నుంచి పోటీ చేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.