ఎర్ర జొన్న రైతులు మూకుమ్ముడి నామినేషన్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎర్ర జొన్న రైతులు మూకుమ్ముడి నామినేషన్లు

నిజామాబాద్, మార్చి 18, (way2newstv.com)
 నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు నాంది పలుకుతూ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుండి పసుపు, ఎర్రజొన్న రైతులు ఈసారి మూకుమ్మడిగా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. తమ సమస్య తీవ్రతను దేశమంతటికీ చాటాలనే భావనతో రైతు సంఘాలు, గ్రామాభివృద్ధి కమిటీలు ఈ మేరకు ఎక్కడికక్కడ తీర్మానాలు చేస్తున్నాయి. గ్రామానికి కనీసం ఇద్దరు ముగ్గురు చొప్పున రైతులతో నామపత్రాలు సమర్పించేలా సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా పసుపు బోర్డు సాధన కమిటీ సభ్యులు సైతం ఊరూరా తిరుగుతూ రైతులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. 


ఎర్ర జొన్న రైతులు మూకుమ్ముడి నామినేషన్లు

నామినేషన్ దాఖలు చేసేందుకు అయ్యే వ్యయాన్ని గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో భరించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఒకవేళ రైతులు తమ నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఒక్క నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే కనీసం వేయి వరకు నామినేషన్లు దాఖలవుతాయని అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు ఎన్నికల సంఘం ఈవీఎంల ద్వారా పోలింగ్‌ను నిర్వహించడం సాధ్యపడదని, బ్యాలెట్ పద్ధతిన కూడా ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యంగా మారుతుందని, తద్వారా యావత్ దేశం దృష్టిని ఆకర్షించవచ్చని పసుపు రైతులు, రైతు సంఘాల బాధ్యులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగానే పసుపు పంట సాగు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఎక్కువగా ఉంటుంది. నిజామాబాద్‌లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కనీసం 40వేల ఎకరాల విస్తీర్ణంలో పసుపు పంటను సాగు చేస్తారు. ఈ పంట సాగు కోసం ఎకరాకు కనీసం లక్ష నుండి లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడులు అవుతుండగా, అసలేమాత్రం నిలకడ లేని మద్దతు ధర కారణంగా రైతులు పెట్టుబడులను కూడా రాబట్టుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మార్కెట్‌లలో మధ్య దళారులు, వ్యాపారులదే ఇష్టారాజ్యంగా కొనసాగుతూ, వారు నిర్ణయించిన ధరకే రైతులు పంటను విక్రయించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ సమస్యల పరిష్కారానికి పసుపు బోర్డు ఏర్పాటే ఏకైక మార్గమని నిర్ణయించుకుని గత దశాబ్ద కాలంగా గల్లీ నుండి ఢిల్లీ స్థాయి వరకు ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇటీవలే నెలన్నర రోజుల క్రితం సైతం ఎర్రజొన్న రైతులతో కలిసి పసుపు రైతులు పలుమార్లు జాతీయ రహదార్లను దిగ్బంధించి, వంటావార్పుతో నిరసనలు చాటారు. పసుపు పంటకు కనీసం 15వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో తమ సమస్య తీవ్రతను చాటుతూ యావత్ దేశం దృష్టిని ఆకర్షించేందుకు ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలను వేదికగా మల్చుకోవాలని పసుపు రైతులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మూకుమ్మడిగా నామినేషన్లు దాఖలు చేసి, బరిలో నిలిచినట్లయితే ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రైతులు ఈ దిశగా సన్నాహాలు చేసుకుంటుండడంతో వారిని అధికార పక్షం తరఫున బుజ్జగించే యత్నాలు సైతం జరుగుతున్నాయని తెలుస్తోంది.