అక్రమ దందాకు అడ్డే లేదా..? (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అక్రమ దందాకు అడ్డే లేదా..? (కరీంనగర్)

కరీంనగర్, మార్చి4 (way2newstv.com): 
రేషన్‌ దందాకు అడ్డుకట్ట పడిందన్నది నామమాత్రమే.. ప్రజాధనంతో అక్రమార్కుల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.. ఏకకాలంలో మంచిర్యాల, ఉప్పల్‌లో రేషన్‌ బియ్యం పట్టుబడగా.. మళ్లీ మూడు రోజుల వ్యవధిలోనే ఈనెల 16న కరీంనగర్‌ శివారు అల్గునూరు చౌరస్తాలో 250 క్వింటాళ్లు పట్టుబడ్డాయి. సదరు ఘటనలతో పౌరసరఫరాల శాఖ అధికారుల తనిఖీ లోపాన్ని చాటుతుండగా.. టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ మాత్రమే రేషన్‌ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అక్రమార్కులపై నామమాత్రపు కేసులతోనే సరిపుచ్చుతారా? పీడీ చట్టాన్ని ప్రయోగిస్తారా? అటుంచితే.. అక్రమ రవాణాలో మరింత లోతుగా విచారణ జరిపి సూత్రధారుల భరతం పట్టాల్సిన అవసరముంది. ఈ విషయంలో రాష్ట్ర విజిలెన్స్‌ బృందం కూపీ లాగుతుండగా.. మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.


అక్రమ దందాకు అడ్డే లేదా..? (కరీంనగర్)

రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారంలో కరీంనగర్‌కు చెందిన ఇద్దరు వ్యాపారుల పాత్ర ఉందని తెలుస్తోంది. అల్గునూరు ఘటనలో ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. కాగా రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి లారీల్లో రవాణా చేసే స్థాయి ఎవరికీ లేదని స్పష్టమవుతోంది. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వీరి వెనుక బడా వ్యాపారులు లేకుండా వ్యాపారం చాలా కష్టంమనే విషయం తెలుస్తోంది. అల్గునూరు వద్ద దొరికిన 250 క్వింటాళ్ల వ్యవహారంలో కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారం సహకారం ఉన్నట్లు సమాచారం.. గతంలో పాఠశాలలు, అంగన్‌వాడీలకు రవాణా చేసే సన్న బియ్యంలోనూ రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసినట్లు పక్కా సమాచారం. ఈ-పోస్‌ నేపథ్యంలో 30 శాతం రేషన్‌ బియ్యం ఆదా అవుతుండగా గరిష్ఠ కార్డుదారులు డీలర్లకు, కిరాణ దుకాణాలకు, గంపగుత్తగా కొనుగోలు చేసే దళారులకు విక్రయిస్తున్నారు. వీటన్నింటిని వివిధ మార్గాల నుంచి ఒకేచోటుకి చేర్చి సీయంఆర్‌ ఉన్నపుడు సీయంఆర్‌లో, పాఠశాలలకు పంపే సన్నబియ్యంలో కలిపేస్తున్నారు. అందువల్లే గతంలో పాఠశాలల్లో మధ్యాహ్న బోజన బియ్యం దొడ్డుగా ఉందని ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి.
అక్రమ దందాలో అక్రమార్కులు నూతన పంథా సాగిస్తున్నారు. సదరు వ్యాపారులకు లారీలున్నప్పటికీ ఇతర రాష్ట్రాల వాహనాలైతేనే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందన్నది వారి సూత్రం. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ లారీలైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర సరకులతో వస్తుండగా తనిఖీ చేసే అవకాశం తక్కువ. పట్టుబడిన లారీల యజమానులను తమదైన శైలిలో పోలీసులు విచారిస్తే వాహనాల ఒప్పందం చేసుకున్నవారు, వ్యాపారంలో పెట్టుబడి పెడుతున్నదెవరు..? అసలు ఎక్కడి నుంచి బియ్యం సేకరిస్తున్నారు..? బియ్యాన్ని ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు వంటి సమగ్ర విషయాలు వెల్లడవనున్నాయి. ప్రధానంగా కరీంనగర్‌, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు ఇందులో భాగస్వాములైనట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో రేషన్‌ బియ్యానికి గిరాకీ ఎక్కువ. మన ప్రాంతంలో సన్నరకాలను ఇష్టపడినట్లు అక్కడ దొడ్డు బియ్యమంటే మక్కువ. దీంతో వ్యాపారులు  దీన్నే ఆసరాగా మలుచుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో అధికారుల పర్యవేక్షణలో డొల్లతనం స్పష్టమవుతోంది. కోళ్లఫారాలు, మామిడితోటలను కొనుగోలు కేంద్రాలుగా మలచుకుని దందా చేస్తుండగా రాత్రివేళలో అనుకూల అధికారులు విధుల్లో ఉన్నప్పుడు పక్కదారి పట్టిస్తున్నారు. కరీంనగర్‌లోని పలు ప్రాంతాలతో పాటు తీగలగుట్టపల్లి శివారు, బెజ్జంకి మండలం దేవక్కపల్లి, శంకరపట్నం ప్రాంతాల్లో రేషన్‌ బియ్యం స్థావరాలు పెద్దఎత్తున ఉన్నాయని సమాచారం. అయితే సదరు సమాచారాన్ని పౌరసరఫరాల అధికారులకు చెబితే తమ పరిధి కాదని, అక్రమార్కులకే సమాచారం చేరవేశారన్న ప్రచారం జరుగుతోంది.