పడిపోతున్నభూగర్భ జల మట్టాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పడిపోతున్నభూగర్భ జల మట్టాలు

అదిలాబాద్, మార్చి 6, (way2newstv.com)
భూగర్భ జల మట్టాలు రోజురోజుకు పతనమవుతుండడం ఆందోళనను రేకెత్తిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి భూగర్భ జలాలు క్రమంగా తగ్గిపోతుండడం. రాబోయే ప్రమాద ఘంటికలకు కారణమవుతుందని అంటున్నారు. విచ్చలవిడిగా బోరు బావుల తవ్వకాలు, వేడి తీవ్రత నిరంతరంగా కొనసాగుతుండడంకు తోడుగా 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా బోర్ల వినియోగం పెరిగిపోతుండడంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈ సారి సైతం భూగర్భజలాల మట్టం పడిపోవడం ప్రమాద సంకేతాన్ని అందిస్తుందని అంటున్నారు. మరో నెల రోజుల వరకు నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకొనే ప్రమాదం ఉందన్న సంకేతాలను సంబంధిత భూగర్భ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పడిపోయి తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. అలాగే మైదాన ప్రాంతంలో సైతం నీటి కొరత ముంపు పొంచి ఉందని అంటున్నారు. వేసవి ప్రారంభంలోనే పరిస్థితి దయనీయంగా మారడం ఆందోళన కలిగిస్తుంది. 


పడిపోతున్నభూగర్భ జల మట్టాలు

ఇదిలా ఉండగా ప్రస్తుత రబీ సీజన్‌లో బోరు బావులపై ఆధారపడి సాగు చేస్తున్న పంటలకు నీరందే పరిస్థితి లేదని అంటున్నారు. వరి ఇతర వాణిజ్య పంటలకు పడిపోతున్న భూగర్భ జల మట్టం కారణంగా ఇబ్బందులు తప్పక పోవచ్చని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాగా వివిధ ప్రాజెక్టులలోనూ, చెరువుల, కుంటలల్లోనూ నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. వీటిపై ఆధారపడి సాగవుతున్న పంటలకు సైతం రాబోయే రోజులలో కష్టాలు తప్పక పోవచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా నీటి కొరత తీవ్రం కానుందన్న సంకేతాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ చర్యల విషయంలో ఇప్పటి వరకు ముందస్తు ప్రణాళికలను రూపొందించక పోవడం విమర్శలకు తావిస్తుందని అంటున్నారు. భూగర్భ జల శాఖ నివేదికల ప్రకారం సంబంధిత శాఖ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోనే కాకుండా గుట్ట మీద పల్లెల్లోనూ సమస్య తీవ్రంగా ఉన్న మైదాన ప్రాంతాల్లోనూ ప్రత్యామ్నాయ చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని కొరుతున్నారు. కాగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాది ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వేసవి తీవ్రత ఎక్కువైతే రిజర్వాయర్లలో నీరు అడుగంటిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. భూగర్భ జలాలను పెంచుకొనేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతుండగా, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలు ఆసక్తి కనబర్చక పోవడం ఇందుకు కారణమని అంటున్నారు. వర్షాలు అంతంతమాత్రంగానే కురవడంతో ఈ ఏడాది నీటి కష్టాలు తప్పక పోవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.