కాకినాడ, మార్చి 18, (way2newstv.com)
లోయర్ సీలేరు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నాలుగో యూనిట్ సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. బోటమ్ లేబరెంట్ సీల్ ఊడిపోవడం వల్ల సరఫరా నిలిచిపోయిందని డీఈ సత్యనారాయణ తెలిపారు. ఈ గేట్ సీల్ ఊడిపోవడం వల్ల వికెట్ గేట్ వద్ద రాళ్లు, చెక్కలు అడ్డుపడి ఉండవచ్చునని ఆయన తెలిపారు. దీనివల్ల నీరు యూనిట్లలోకి వచ్చి మునిగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.ఇటీవలే వికెట్ గేట్ సీల్ ఊడిపోయి సుమారు ఐదు రోజులు 4వ యూనిట్ నిలిచిపోయింది. దీంతో హుటహుటిన కాంట్రాక్టర్‌ను పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. మళ్లీ బోటమ్ లేబరెంట్ ఊడిపోవడం వల్ల మళ్లీ నాలుగో యూనిట్ సుమారు 25 రోజులపైనే 115 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనున్నది.
పొల్లూరులో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి
దీంతో అభిరామ్ ఇంజినీరింగ్ కంపెనీకి పనులు అప్పగిస్తున్నట్లు డీఈ తెలిపారు.పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించి తరచూ 3, 4 యూనిట్లు మొరాయిస్తున్నా జెన్‌కో యాజమాన్యం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలవిద్యుత్ కేంద్రం నిర్మించి సుమారు 45 ఏళ్లు అవుతున్నా యంత్ర సామగ్రి మార్చకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇక్కడ యూనిట్లకు ఏమైనా సాంకేతిక లోపం తలెత్తితే తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు తప్ప శాశ్వత పనులు చేపట్టడం లేదు.ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో మార్పు ఉండడం లేదు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సాంకేతిక సమస్య తలెత్తితే 25 ఏళ్ల నుంచీ ఒకే సంస్థకు పనులు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి