చంద్రబాబు మైండ్ గేమ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు మైండ్ గేమ్

విజయవాడ, మార్చి 9, (way2newstv.com)
40 ఏళ్ల రాజకీయం అనుభవం, చేతిలో అధికారం, మీడియా బలం, 14 ఏళ్లు ముఖ్యనేతగా, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా రాష్ట్ర పరిస్థితిపై పూర్తి అవగాహన, పోల్ మేనేజ్ మెంట్ పై పట్టు, బలమైన పార్టీ క్యాడర్, గ్రామగ్రామానా ఓటు బ్యాంకు… ఇవన్నీ చంద్రబాబు నాయుడు బలాలు. ఈ బలాలతోనే ఆయన రానున్న ఎన్నికలకు వెళుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనంత సీరియస్ గా ఈ ఎన్నికలను ఆయన తీసుకుంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి అర్థరాత్రి వరకు ఆయన ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. ప్రతీ రోజూ గంటల తరబడి పార్టీ క్యాడర్ తో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ ఎన్నిలకు ఎలా సిద్ధం కావాలో సూచిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలకు రెండు నెలల ముందుగానే ఆయన పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ప్రతీ అభ్యర్థిపై అనేక సర్వేలు చేయించుకొని వారి పరిస్థితిని బేరీజు వేసుకొని టిక్కెట్లు కేటాయిస్తున్నారు.తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో వైసీపీని దెబ్బతీయడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలూ చేశారు. చేస్తున్నారు. రాజకీయ పార్టీగా ప్రత్యర్థిని దెబ్బతీయాలనుకోవడం సహజం. ఇప్పుడు ఎన్నికలకు చంద్రబాబు పక్కాగా ప్రిపేర్ అవుతున్నారు. తనకు లాభం చేకూర్చే వాదనలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. 


 చంద్రబాబు మైండ్ గేమ్

మోడీ, కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ మధ్య జరుగుతున్నాయన్న ప్రచారమూ మొదలుపెట్టారు. జగన్ కేసీఆర్, మోడీ చేతుల్లో కీలుబొమ్మలా ఆడే బలహీన నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. జగన్ అవినీతిపరుడు అనే ప్రచారాన్ని తొమ్మిదేళ్లుగా చేస్తూనే ఉన్నారు. జగన్ వస్తే అమరావతి మారుస్తారనే మౌత్ పబ్లిసిటీ ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతోంది. అవినీతి, రౌడీయిజం రాజ్యమేలుతుంది అనే భయం ప్రజల్లో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే కేవలం పదేళ్ల అనుభవం మాత్రమే ఆయనది. స్వంత మీడియా సాక్షి, సోషల్ మీడియా తప్ప మీడియా బలం లేదు. పోల్ మేనేజ్ మెంట్ లో లోపాల వల్ల గత ఎన్నికల్లోనే దెబ్బతిన్నారు. ఎన్నికలను ఎదుర్కున్న అనుభవం కూడా పెద్దగా లేదు. ఈ ప్రతికూలతల మధ్య అన్ని అనుకూలతలూ ఉన్న చంద్రబాబును జగన్ ఎదుర్కుంటున్నారు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఆయన పార్టీ గెలుపు పట్ల క్యాడర్ లో విశ్వాసం నింపుతున్నారు. ఇప్పటికైతే వైసీపీదే విజయం అంటూ సర్వేలు చెబుతున్నాయి. వైసీపీలోకి చేరికలూ బాగానే ఉన్నాయి. అధికార పార్టీని సైతం వీడి వైసీపీలో చేరుతున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ చంద్రబాబు వ్యూహాలను జగన్ ఎదుర్కొని విజేతగా నిలవగలరా అనే అనుమానాలు వస్తున్నాయి.జగన్ వ్యక్తిత్వం ఇప్పటికే ఎన్నో ప్రచారాలు చేశారు. ఎన్నికల వేళ ఇవన్నీ ఇంకా ఎక్కువయ్యాయి. ఫారం-7 పేరిట జగన్ పెద్ద నేరానికి పాల్పడ్డారని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. టీడీపీకి ఉన్న మీడియా బలం, తటస్థులుగా ఉంటూ టీడీపీ వాదనను ప్రచారం చేసే క్యారెక్టర్లు, ఇతర బలాలు ఈ పనిని సులువుగా చేస్తున్నాయి. టీడీపీ ప్రచారాలను వైసీపీ పూర్తిగా తిప్పికొట్టలేకపోతోంది. సోషల్ మీడియా ద్వారా ఆ ప్రయత్నం జరుగుతున్నా టీడీపీ మీడియా బలం ముందు సరిపోవడం లేదు. ఈసారి జగన్ వేవ్ ఉన్నదనే అంచనాలు ఉన్నందున ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది టీడీపీ మరిన్ని వ్యూహాలను అమలు చేస్తుంది. మరి, జగన్ వీటన్నిటినీ చేదించి విజయతీరాలకు చేరుకోగలరా ? ఎన్నికలకు మరో రెండు నెలలు కూడా లేదుగా చూద్దాం. ఏం జరుగుతుందో