ప్రజలకు నోట్ల పండుగ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రజలకు నోట్ల పండుగ

హైద్రాబాద్, మార్చి 28 (way2newstv.com)
ఎన్నికలు వచ్చినప్పుడల్లా... ఓట్ల పండుగతోపాటూ... ప్రజలకు నోట్ల పండుగ చేస్తున్నాయి పార్టీలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ధన ప్రవాహం సాగించిన పార్టీలు... లోక్ సభ ఎన్నికల్లో కూడా కట్టల పాముల్ని బయటకు తీస్తున్నాయి. మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలా మంది కోటీశ్వరులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలే. అందువల్ల వారంతా ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టేందుకు వెనకాడట్లేదని తెలుస్తోంది. అధికార పాలక పక్షం కచ్చితంగా 16 స్థానాలు గెలవాలని కంకణం కట్టుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పరువు నిలుపుకోవాలంటే... సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. ఇక అభ్యర్థులు కూడా తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ... నోట్ల కట్టలు బయటకు తీస్తున్నారని సమాచారం.ప్రస్తుతం ఈ అడ్డగోలు ఖర్చులపై ఎన్నికల సంఘం దృష్టిసారిస్తోంది. లోక్ సభ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారో పరిశీలిస్తోంది. ప్రధానంగా 32 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ వ్యయం ఎక్కువగా ఉంటుందని లెక్కగట్టింది. అనధికారిక లెక్కల ప్రకారం... సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఖమ్మం లోక్ సభ స్థానాల్లో ఒక్కో చోటా కనీసం రూ.300 కోట్లు ఖర్చు చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక్కో ఓటుకూ రూ.5 వేలైనా ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు.


ప్రజలకు నోట్ల పండుగ

ఇదివరకు అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన స్థానాల వివరాల్ని ఇప్పటికే సేకరించిన ఈసీ... ఈసారి ఎన్నికల్లోనూ అక్కడ ఖర్చు ఎక్కువగానే ఉండొచ్చని భావిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులెవరు, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఆర్థిక బలమెంత వంటివి అంశాల్ని పరిశీలిస్తోంది.ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, నల్గొండ, వరంగల్, ఖమ్మం పార్లమెంట్ స్థానాలు అత్యంత ఖరీదైనవిగా ఈసీ అంచనా వేస్తోంది. అక్కడ అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా వెనకాడట్లేదని తెలుస్తోంది. ఖర్చుల లెక్కలు వేసి చర్యలు తీసుకునేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్, రాజేంద్రనగర్, వేములవాడ, సిరిసిల్ల, శేరిలింగంపల్లి, మంచిర్యాల, గజ్వేల్, షాద్ నగర్, కొడంగల్, మహబూబ్ నగర్, కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమలో భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఇక మద్యం, బిర్యానీ సంగతి చెప్పక్కర్లేదు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌‍కీ ఒక్కో అభ్యర్థీ రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఒక్కొక్కరూ. రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు కావడంతో ఖర్చు రూ.300 కోట్లకు చేరుతోందని అంటున్నారు. తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలుండగా 15 నియోజకవర్గాల్లో మొత్తం రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది.