న్యూఢిల్లీ, మార్చి 26 (way2newstv.com)
లోక్ సభ ఎన్నికల వేళ ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నేతల గురించే చర్చ జరుగుతుంది. సాధారణంగా ఎప్పుడూ పదవుల కోసం ముందుండే వీరిద్దరూ వెనుకంజ వేయడాన్నొ కొందరు పలాయనవాదంగా చిత్రీకరిస్తుండగా, వారు మాత్రం తమ కారణాలు తమకు ఉన్నాయంటున్నారు. వారే ఎన్సీపీ నేత శరద్ పవార్, బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి. ఈ ఇద్దరూ ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తాము బరిలో ఉండమని వారంతట వారే ప్రకటించి చర్చకు కారణమయ్యారు. సీనియర్ నేతలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది ఎవరికీ అంతుపట్టకుండా ఉంది.ఇద్దరునేతలకు ఇదే సరైన సమయం. కలసి వచ్చిందంటే ప్రధాని పదవి అందే ఛాన్స్. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీకి గత ఎన్నికల మాదిరిగా ఇప్పుడు విజయం నల్లేరు మీద నడక కాదన్నది అందరికీ తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో పూర్తిగా బలహీనంగా ఉన్న బీజేపీ, ఉత్తరాదిన కూడా కొంత వెనకబడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూటమి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.
శరద్ పవార్ , ములాయాం పలాయనవాదం
అందుకే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో అక్కడ పొత్తు పెట్టుకోకున్నా జాతీయ స్థాయిలో మద్దతిస్తామంటున్నారు.ఈ పరిస్థితుల్లో అన్నీ కలసి వస్తే శరద్ పవార్ కు ప్రధాని పదవి దక్కే అవకాశం ఉంది. కొన్నేళ్ల కల సాకారమయ్యే ఛాన్సు ఉంది. కానీ ఆయన ఉన్నట్లుండి తాను పోటీ చేయడం లేదని చెప్పేశారు. తమ కుటుంబం నుంచి ముగ్గురు బరిలో ఉండకూడదన్నది శరద్ పవార్ వాదన. కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రజల ఆశీర్వచనమే అవసరం. కర్ణాటకలో దేవెగౌడ కుటుంబం మొత్తం దాదాపు రాజకీయాల్లోకి వచ్చేసినట్లే. శరద్ పవార్ చెబుతున్న కారణం సిల్లీగా అనిపిస్తుందంటున్నారు. ఇక మాయావతి విషయానికొస్తే అక్కడ బలమైన రెండు పార్టీలూ చేతులు కలిపాయి. ఎస్పీ,బీఎస్పీల జోడికి తిరుగులేదన్న సర్వేలు వచ్చాయి. అయితే ఆమె హఠాత్తుగా తాను పోటికి దిగడం లేదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మాయావతి కూడా ప్రధాని అభ్యర్ధి. కుదిరితే….గిదిరితే… బెహన్ జీని ప్రధాని పీఠం ఎక్కించి ఇక్కడ తనకు మార్గం సుగమం చేసుకోవాలనుకుంటున్నారు అఖిలేష్ యాదవ్. అయితే ఆమె పోటీ చేయకపోవడానికి చెప్పే కారణం కూడా వింతగా కన్పిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రచారం చేయాల్సి ఉన్నందున తాను పోటీకి దూరంగా ఉంటానని చేసిన ప్రకటన సీరియస్ ది కాదని తెలుస్తూనే ఉంది. ఈ ఇద్దరినేతలకు మరోసారి మోదీ అధికారంలోకి వస్తారన్న అనుమానం ఉందా? కాంగ్రెస్ కూటమి గెలవలేదన్న సంకేతాలు ఉన్నాయో తెలియదు కాని వీరిద్దరి రాజకీయ నిర్ణయం మాత్రం మోదీకి అనుకూలమేనన్న వాదనలు మాత్రం బలంగా విన్పిస్తున్నాయి.