పత్తిపాడు నుంచి మరో అధికారి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పత్తిపాడు నుంచి మరో అధికారి

గుంటూరు, మార్చి 5, (way2newstv.com)
రాజధానిని ఆనుకునే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది. బయట నుంచి వచ్చిన నేతలను తాము స్వాగితించబోమని స్థానిక పసుపు పార్టీనేతలు చెప్పేశారు. లోకల్ వారికి ఎవరికి ఇచ్చినా తాము గెలుపు కోసం కష్టపడతామని, ఐఏఎస్, ఐపీఎస్ లను తమ నెత్తిపై రుద్దబోకండంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు స్థానిక నేతలు. ఒకవేళ తమ అభిప్రాయానికి విరుద్ధంగా అభ్యర్థిని బయట నుంచి తీసుకువస్తే తాము కనీసం ప్రచారం కూడా చేయబోమని తేల్చి చెప్పేశారు. దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గం నిజంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడి నుంచి మాకినేని పెదరత్తయ్య ఐదు సార్లు గెలిచారు. 

 

పత్తిపాడు నుంచి మరో  అధికారి


2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ గా మారింది. ఇక్కడ ఒక బలమైన సామాజిక వర్గమే పార్టీని, ఎమ్మెల్యేను శాసిస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఐఆర్ఎస్ అధికారి రావెల కిశోర్ బాబు పోటీ చేసి విజయం సాధించారు. రావెల గతంలో బాలయోగి వద్ద ఓఎస్డీగా కూడా పనిచేశారు. ఆ పరిచయంతో పాటు సామాజికవర్గం, విద్యావంతుడు కావడంతో చంద్రబాబు ప్రత్తిపాడు టిక్కెట్ ఇచ్చారు. అయితే రావెల స్థానిక టీడీపీ నేతల పెత్తనాన్ని సహించలేకపోవడం, క్రమంగా రావెలకు, నేతల మధ్య దూరం పెరగడం వేగంగానే జరిగిపోయాయి.రావెల కోసం స్థానిక నేతలను వదులుకోలేని చంద్రబాబు రావెలను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత రావెల పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరిపోయి ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి సుచరిత అభ్యర్థిత్వం దాదాపు ఖారారయిపోయింది. ఆమె గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసి ఉండటంతో కొద్దిరోజులుగా గ్రామాల పర్యటన చేస్తున్నారు. ఇలా జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.టీడీపీలో మాత్రం అభ్యర్థి ఎవరో చంద్రబాబు ఇంతవరకూ తేల్చలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రత్తిపాడుకు రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో నియోజకవర్గంలోని టీడీపీ నేతలు అగ్గిమీద గగ్గిలం అవుతున్నారు. మళ్లీ రావెలలాంటి వారిని తమ నెత్తిపై రుద్దితే ఒప్పుకునేది లేదని తెగేసి చె్పారు. లోకల్ గా ఉన్న వారిని ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసినా తాము పూర్తిగా సహకరిస్తామని వారు అధిష్ఠానానికి తెగేసి చెప్పడంతో చంద్రబాబు ఈ నియోజకవర్గం ఫైలును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.