అమరావతి, మార్చి 4 (way2newstv.com):
చుక్కల భూములు, 1954కు ముందు అసైన్డు చేసిన భూములు, నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములను రికార్డులను అనుసరించి సమస్యకు పరిష్కారం చూపింది. ఆర్‌ఎస్‌ఆర్‌లోని చుక్కలున్న సర్వే నెంబర్ల భూములను ప్రభుత్వానికి చెందినవిగా పరిగణించి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసేందుకు రెవెన్యూ అధికారులు అంగీకరించడం లేదు. అంతేగాక వాటి వివరాలను నిషేధిత జాబితాలో పొందుపరిచి రిజిస్ట్రేషన్లు జరగకుండా చూస్తోంది. అయితే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు చరమగీతం పాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్యలు చేపట్టింది. పూర్వపు అడంగళ్లు, 1-బీ, రిజిస్ట్రార్ ఆఫ్ హోల్డింగ్స్‌ను అనుసరించి క్రమబద్ధీకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జిల్లాలోని వీఆర్వోలు, తహశీల్దార్లు, ఆర్డీవోలు కలెక్టరేట్‌లో ఉండి కొన్నింటికి పరిష్కారం చూపారు. 18,245 మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు 10,927 మంది రైతులకు ఉపశమనం కలిగించారు. అంతేగాక దరఖాస్తు చేసుకోని 7,500 మందికి సమస్యను పరిష్కరించారు.
చుక్కలకు పరిష్కారం (అమరావతి)
రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు మేరకు 1954 నాటి ముందున్న అసైన్డు భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాంటి భూములను గుర్తించి జాబితా నుంచి తొలగించారు. జిల్లాలో ప్రధానంగా తాడికొండ, బాపట్ల, రాజుపాలెం, మంగళగిరి, రేపల్లె మండలాల్లోని 4వేల మంది లబ్ధి పొందారు. ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించి, అమాయక రైతులకు విక్రయిస్తున్నారు. మరికొందరు బ్యాంకులలో పంట రుణాలు పొంది లబ్ధిపొందుతున్నారు. వీరి అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం నిషేధిత జాబితా తయారు చేసి రిజిష్ట్రేషన్ల శాఖకు అప్పగించింది. అప్పటి నుంచి ప్రభుత్వం అందజేసిన సర్వే నెంబర్లకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అయితే కొన్ని పొరపాట్ల వల్ల పట్టా భూములు కూడా దీనిలో నమోదయ్యాయి. రైతులు తమ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ వచ్చినా పరిష్కారం లభించలేదు. ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అలాంటి వాటిని పరిశీలించి తొలగించాలని ఆదేశించింది. దాంతో అధికారులు 6వేల మంది రైతులకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక మరికొన్ని రెవెన్యూ అంశాలకు పరిష్కారం చూపారు.
Tags:
Andrapradeshnews