రాజమండ్రి, మార్చి 4 (way2newstv.com):
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో అందించాల్సిన కోడిగుడ్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. జిల్లాలో వీటిని సరఫరా చేసే గుత్తేదారులకు ఇచ్చిన ఒప్పందం ముగిసిపోవడంతో కొంతకాలం నుంచి స్థానిక వ్యాపారులతోనే సరఫరా చేయిస్తున్నాయి. వారికి రూ. కోట్లలో బకాయిలు పేరుకుపోవడంతో చివరికి చేతులెత్తేశారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. జిల్లాలో 3,816 ప్రాథమిక పాఠశాలలు, 331 ప్రాథమికోన్నత, 508 ఉన్నత పాఠశాలల్లో 7,27,942 మంది విద్యార్థులున్నారు. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు వారానికి అయిదు గుడ్లు భోజనంలో అందించాలి. ప్రతిరోజూ సుమారుగా 3.15 లక్షల గుడ్లు అవసరం అవుతాయి. గుడ్డుతో పాటు పప్పు ఆకుకూర, కూరగాయలు, సాంబారు మెనూలో తప్పనిసరి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు గుడ్డు సరఫరా చేసేలా ఏజెన్సీకి టెండర్ పూర్తిచేశారు. వారు జిల్లాల వారీగా ఉప గుత్తేదారులను నియమించారు. గతేడాది డిసెంబరులోనే ఆ ఒప్పందం ముగిసిపోయింది.
గుడ్డు పాయే.. (తూర్పుగోదావరి)
అప్పట్లో గుడ్ల సరఫరా నిలిచిపోవడంపై స్పందించిన విద్యా శాఖ జిల్లాకు సంబంధించిన కోళ్ల పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదించి తాత్కాలికంగా సరఫరా చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లో ఉండే కోళ్లఫారాల నిర్వాహకులతో రెండు మాసాల నుంచి వీటిని సరఫరా చేశారు. వీరికి మండల విద్యావనరుల కేంద్రాల నుంచి బిల్లులు చేసి పంపుతున్నారు. ప్రస్తుతం ఆయా కోళ్లఫారాల యజమానులకు ఒక్కొక్కరికి రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వారు గత వారం నుంచి గుడ్ల సరఫరా నిలిపివేశారు. ఇప్పటివరకు సరఫరా చేసినవి సర్దుబాటు చేయగా, శుక్రవారం నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు లేకుండానే వండిపెడుతున్నారు.
రాష్ట్రవ్యాప్త టెండర్ గడువు ముగిసిన గతేడాది డిసెంబరు నుంచే పాఠశాలలకు సరఫరా చేసే గడ్డుకు గడ్డుకాలం తప్పలేదు. అంతకుముందు నుంచే బకాయిలు పేరుకుపోయాయి. అప్పట్లో గుత్తేదారులకు ఒక్కో కోడిగుడ్డుకు రూ.4.16 పైసలు ధర నిర్ణయించారు. జిల్లాల వారీగా వచ్చేసరికి ఒప్పందం చేసుకున్న ప్రాంతంలో ధర, అక్కడి ఖర్చులను బట్టి గిట్టుబాటు కాని పరిస్థితుల్లో సరఫరాకు చాలాచోట్ల మక్కువ చూపలేదు. చివరికి నెక్ ధర ఆధారంగా చెల్లించాలని కోరారు. ఈ నేపథ్యంలో గతేడాది వరకు సరఫరా సవ్యంగా చేయగలిగారు. జిల్లాకు వచ్చేసరికి రూ. 4.68 ఇచ్చారు. గత కొద్దిరోజుల నుంచి కొన్నిచోట్ల వారానికి అయిదు గుడ్లు లేకుండా పోయాయి. తాజాగా ఇస్కాన్ ఏజెన్సీ తప్ప మిగతా అన్నిచోట్ల కోడిగుడ్ల సరఫరా అటకెక్కింది. కొన్నిచోట్ల ఇప్పటి వరకు సరఫరా చేసిన వాటిలో అరకొర గుడ్లు ఉంటే పిల్లల సంఖ్యకు అవి ఎటూ చాలకపోవడంతో ఉన్నవాటిని లెక్కచెప్పి ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు.
Tags:
Andrapradeshnews
