శ్రీ కల్యాణ శ్రీనివాసుడు అభయం
తిరుపతి, మార్చి 1, (way2newstv.com)
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు వేంకటరాముడై హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
హనుమంత వాహనంపై శ్రీ కోదండరామస్వామివారి అవతారంలో
బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కల్యాణ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. భవిష్యోత్తర పురాణంలోని వేంకటాచల మహత్మ్యంలో శ్రీవారు వేంచేసిన పుట్ట - కౌసల్య, చింతచెట్టు - దశరథుడు, శేషాచలం - లక్ష్మణుడు, పర్వతప్రాంతం - అయోధ్య అని పేర్కొనబడింది. శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి ధనంజయులు, సహాయ కార్యనిర్వహణాధికారి లక్ష్మయ్య, ప్రధాన కంకణబట్టార్ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags:
Andrapradeshnews