కరీంనగర్,మార్చి 18, (way2newstv.com)
బీటీ కాటన్ విత్తనాల ధర తగ్గింపు రైతులకు ఊరట నిచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో బీటీ-2 రకం పత్తి విత్తనాల ధర తగ్గడం రైతుల్లో సంతోషాన్ని నింపింది. దీంతో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుందని పత్తి రైతులు ఆశిస్తున్నారు. బీటీ-2 రకం పత్తి విత్తనాల రేటు తగ్గింపు వల్ల జిల్లాలోని రైతులకు సుమారు రూ. 2 కోట్ల లబ్ధి చేకూరనుంది. బీటీ-2 రకం పత్తి విత్తనాల ధరను తగ్గిస్తూ కేంద్రం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీటీ-2 రకం పత్తి విత్తనాల ప్యాకెట్‌కు రూ.60 తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వచ్చే వానాకాలం నుంచి తగ్గిన ధర అమల్లోకి రానుందని, మార్కెట్‌లో రూ.740కి బీటీ-2 రకం పత్తి విత్తనాల ప్యాకెట్ రైతులకు లభించనుందని స్పష్టం చేసింది. కొన్నేళ్ల నుంచి రైతులు పత్తి పంట సాగుకు బీటీ-2 రకం కాటన్ విత్తనాలే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో బీటీ-1 రకం పత్తి విత్తనాలు ఉన్నప్పటికీ బీటీ-2 రకం పత్తి విత్తనాలు నాటడానికే రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తొంభై శాతానికిపైగా బీటీ-2 రకం పత్తి పంట సాగవుతోంది.
రైతులకు ఊరటనిస్తున్న బీటీ కాటన్
బుకింగ్ పేరిట రైతుల నుంచి విత్తనాల కోసం అడ్వాన్స్ డబ్బు వసూలు చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ విత్తన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొందరు ప్రతి ఏడాది వానాకాలం సీజన్ ముందు బుకింగ్ విధానానికి తెరదీస్తున్నారు. కాగా పలువురు రైతులు బుకింగ్ సైతం చేశారు. బుకింగ్ ప్రకారం సదరు కంపెనీ తమకు సరఫరా చేసిన తర్వాత రైతులకు ఎమ్మార్పీకి మించకుండా విత్తనాలు అమ్మకాలు చేపట్టాలనే నిబంధనను వ్యవసాయశాఖ అధికారులు అమల్లో పెట్టాల్సి ఉంది. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై చర్యలు తీసుకునే అవకాశాలున్నా వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. రైతుల నుంచి అడ్వాన్స్ బుకింగ్ పేర డబ్బు వసూలు చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గత జూన్ ప్రారంభంలో వానలు పడగానే డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మార్కెట్‌లో ఎమ్మార్పీ రూ.800 కంటే ఎక్కువ ధరపై బీటీ-2 రకం పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు విక్రయించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే రూ.800 కంటే తక్కువ ధరకు రైతులు విత్తనాలు పొందారు450 గ్రాముల బీటీ-2 రకం పత్తి విత్తనాలు ఉండే ప్యాకెట్ ఎమ్మార్పీని కేంద్రం రూ.740గా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్‌లో పత్తిపంట సాగు చేసే రైతులకు విత్తనాల కొనుగోలులో కొంత ఆర్థికభారం తగ్గనుంది. బీటీ-2 రకం పత్తి విత్తనాల ధర తగ్గింపుతో జిల్లాలోని రైతులకు రూ.2 కోట్లకు పైగా లబ్ధి చేకూరనుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రైతులు 1,70,946 ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 1.64 లక్షల ఎకరాలు. ఈ ఏడాది పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గత సంవత్సరం మిర్చి పంట సాగు చేయడం వల్ల ఆర్థికంగా రైతులు నష్టపోయారు. దీంతో ఈ ఏడాది మిరప పంట సాగు విస్తీర్ణం తగ్గించి పత్తి పంట సాగు విస్తీర్ణం పెంచినట్లు వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. పత్తి పంట సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకున్నా 1.64 లక్షల ఎకరాల్లో నాటేందుకు రైతులకు 3.28 లక్షల బీటీ-2 రకం పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం.