మరింత దూరం (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరింత దూరం (గుంటూరు)

గుంటూరు, మార్చి 7 (way2newstv.com): 
సలే దూరవిద్య. అధికారుల తీరుతో అభ్యర్థులకు అది మరింత దూరమవుతోంది. దూరవిద్యలో యూజీ, పీజీ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్య, ఉద్యోగాలు చేయాలనుకున్న అభ్యర్థుల ఆశలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రం నీరుగార్చింది. ఆయా కోర్సులు చదవటానికి సకాలంలో ప్రవేశాలు చేసుకున్న అభ్యర్థులకు దూర విద్య క్యాలెండర్ని అనుసరించి పరీక్షలు పెట్టలేని దురవస్థ నెలకొంది. ఈ పరిణామం అభ్యర్థులను బాధిస్తోంది. వర్సిటీ అధికారుల పర్యవేక్షణా లోపం.. దూరవిద్య కేంద్రం ఉద్యోగుల నిర్లిప్తిత విద్యార్థులకు శాపంగా మారింది. స్టడీ సెంటర్ల మంజూరీలో చూపుతున్న ఆసక్తి ప్రవేశాలు చేసుకున్న వారికి సకాలంలో పరీక్షలు పెట్టే విషయంలో చూపటం లేదనే విమర్శలను వర్సిటీ మూటగట్టుకుంటోంది.
2018 నుంచి దూరవిద్యకు సంబంధించి ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ అంతా నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారమే అన్ని విశ్వవిద్యాలయాలు పాటించేలా దూరవిద్య మండలి (డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌: డెక్‌) విధానపరమైన నిర్ణయం తీసుకుంది. తరగతుల బోధన ఆన్‌లైన్‌లోనే జరగాలని అందుకు సంబంధించిన ఏర్పాట్లు వర్సిటీ నుంచి స్టడీ సెంటర్ల  వరకు ఏర్పాటు చేసుకోవాలి. 


మరింత దూరం (గుంటూరు)

దేశంలో ఏ విశ్వవిద్యాలయమైనా డెక్‌ నియమ నిబంధనలు అనుసరించే దూరవిద్య ప్రవేశాలు చేసుకుని వాటి వివరాలను డెక్‌ కేంద్రానికి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఈ విషయాన్ని ఏఎన్‌యూ దూరవిద్య కేంద్రం విస్మరించింది. సకాలంలో దూరవిద్య ప్రవేశాల సమాచారం అప్‌లోడ్‌ చేయని కారణంగా వారందిరికి ఈఏడాది మేలో జరిగే పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. దీంతో బాధిత విద్యార్థులు, స్టడీ సెంటర్ల నిర్వాహకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
2018-20 క్యాలెండరియర్‌లో ప్రవేశాలు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఏడాది మేలో జరిగే పరీక్షలకు హాజరుకాలేని పరిస్థితి దాపురించింది. సుమారుగా వీరు 5 వేల మంది వరకు ఉంటారని అంచనా. మేలో పరీక్షలు రాసే అర్హతను కోల్పోవటంపై వర్సిటీలో దుమారం రేగుతోంది. దీనిపై దూరవిద్య కేంద్రం విద్యార్థులకు స్పష్టతను ఇవ్వకుండా ఇంకా గోప్యతను పాటించటం, స్టడీ సెంటర్ల నిర్వాహకులను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇప్పటి దాకా ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు పుస్తకాలు అందించలేదు. దీంతో పరీక్షలు సమీపిస్తున్నా తమకు ఎందుకు పుస్తకాలు పంపటం లేదని ఆరాతీసే విద్యార్థులకు అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. ఈ తప్పిదాలపై విద్యార్థులు రోడ్డెక్కి కన్నెర్ర చేయకుండానే సాధ్యమైనంత వరకు సామరస్యంగా పరిష్కరించి న్యాయం చేయాలనే ఆలోచనలో వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య రామ్‌జీ ఉన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి వర్సిటీలోనే ఉండి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా స్థానిక దూరవిద్య కేంద్రానికి చెందిన ఓ అధికారిని దిల్లీలోని దూరవిద్య మండలి కార్యాలయానికి పంపారు.
నాగార్జున దూరవిద్యకు ఒకప్పుడు బాగా డిమాండ్‌ ఉండేది. సగటున 15వేలకు పైగా ప్రవేశాలు చేసుకునేవారు. అలాంటిది ఇప్పుడు ప్రవేశాలు ఒక్కసారిగా పడిపోయాయి. గత రెండేళ్ల నుంచి 7-8వేల ప్రవేశాలు కావటమే గగనమవుతోంది. సకాలంలో ప్రవేశాలు చేసుకుని పక్కాగా పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం చేపట్టకపోవటం, విద్యార్హత పత్రాలు, స్టడీ మెటీరియల్‌ వంటివి విద్యార్థులకు చేర్చకపోవటం వంటి కారణాలతో దూరవిద్య ప్రవేశాలు తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా సందేహాల నివృత్తికి దూరవిద్య హెల్ప్‌లైన్లకు ఫోన్లు చేసినా సమాధానం ఇవ్వకపోవటం వంటివి ప్రవేశాలు సన్నగిల్లటానికి కారణాలుగా తెలుస్తోంది. 2018 వరకు దూరవిద్య కేంద్రం సంచాలకుగా ఆచార్య శంకర పిచ్చయ్య వ్యవహరించారు. ఆయన హయాంలో ప్రవేశాల నుంచి పరీక్షల నిర్వహణ వరకు, మూల్యాంకనం నుంచి సర్టిఫికెట్ల జారీ సమాచారం వరకు ప్రతిదీ విద్యార్థుల చరవాణికి సమాచారం పంపి అప్రమత్తం చేసేవారు. అప్పట్లో ప్రవేశాలకు విద్యార్థులు బాగా పోటీపడేవారని ఓ స్టడీ సెంటర్‌ నిర్వాహకుడొకరు తెలిపారు. ఆతర్వాత నుంచి వచ్చిన వారు దూరవిద్య గురించి అంతగా పట్టించుకోకపోవటం వంటి వాటితోనే తమకు ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు.
ప్రవేశాల కోసం డెక్‌ నియమ నిబంధనలను పక్కన పెట్టేసి దూరవిద్య కేంద్రం అధికారులు నిర్దేశిత షెడ్యూల్‌ ముగిశాక కూడా ప్రవేశాలు చేసుకున్నారని సమాచారం. విద్యార్థుల ప్రవేశాల నుంచి వారు చెల్లించే ఫీజుల దాకా ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి.  డెక్‌ బృందం ఆ మధ్య వర్సిటీకి వచ్చినప్పుడు నిర్దేశిత సమయం తర్వాత కూడా ప్రవేశాలు చేసుకున్నట్లు వారి తనిఖీల్లో బయటపడినట్లు తెలిసింది. దీనిపై వివరణ కోరితే వర్సిటీ నుంచి సమాచారం కొరవడిందని అందులో భాగంగానే ఆలస్యంగా చేసుకున్న ప్రవేశాలను అనుమతించబోమని డెక్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది. గతేడాది డిసెంబరు 20న డెక్‌ నుంచి వర్సిటీ దూరవిద్య కేంద్రానికి లేఖ వచ్చింది. ఆనెల 23 కల్లా ప్రవేశాలు మొత్తాన్ని డెక్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ లింకుకు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. అయితే దానికి దూరవిద్య కేంద్రం స్పందించలేదని సకాలంలో ప్రవేశాల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయని కారణంగానే ప్రస్తుతం దూరవిద్య కేంద్రంలో గందరగోళం నెలకొందని అంటున్నారు.